
కోర్టుకు సీమాన్ డుమ్మా
సాక్షి, చైన్నె: తిరుచ్చి కోర్టుకు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ గురువారం డుమ్మా కొట్టారు. ఆయనకు న్యాయమూర్తి విజయ అక్షింతలు వేశారు. తిరుచ్చి డీఐజీ వరుణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలను చేసి సీమాన్ ఇరకాటంలో పడ్డ విషయం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును తిరుచ్చి కోర్టు న్యాయమూర్తి విజయ విచారిస్తున్నారు. పలుమార్లు కోర్టుకు సీమాన్ డుమ్మా కొట్టారు. తీవ్ర హెచ్చరికలతో అప్పుడప్పుడు హాజరవుతూ వచ్చారు. ఈ పరిస్థితులలో గురువారం సీమాన్ విచారణకు తప్పని సరిగాహాజరు కావాల్సి ఉంది. అయితే, ఆయన రాలేదు. దీంతో న్యాయమూర్తి విజయ్ ఆయన తరపు న్యాయవాదులకు అక్షింతలు వేశారు. తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు.
డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ నుంచి ..
● గోవిందా పాట తొలగింపు
తమిళసినిమా: నటుడు సంతానం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్. నటుడు ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా ఇందులో చోటు చేసుకున్న శ్రీనివాస గోవిందా అనే పాట పెద్ద వివాదానికి దారి తీసింది. పాట యూట్యూబ్ ఛానళ్లలో వైరల్ అవుతుండడంతో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రం నుంచి వెంటనే ఆ పాటను తొలగించాలని, ఇప్పటికే భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు గానూ నష్టపరిహారంగా రూ. 100 కోట్లు చెల్లించాలని నటుడు సంతానంకు, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నోటీసులు జారీ చేశారు. లేనిపక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రం నుంచి శ్రీనివాసా గోవిందా పాటను తొలగించి, మరోసారి సెన్సార్ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సమస్య సమసిపోయినట్లేనా అన్నది వేచి చూడాలి
క్షేత్రస్థాయిలోకి పళణి సేన
●నేటి నుంచి 82 చోట్ల కార్యక్రమాలు
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే బలోపేతం దిశగా ప్రజలలోకి చొచ్చుకెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ సేనల కార్యక్రమాలు శుక్రవారం నుంచి 14 వారాల పాటుగా జరగనున్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే మళ్లీ జత కట్టిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికలలో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు ఆ పార్టీ నేత పళని స్వామి పదును పెట్టారు. పార్టీ జిల్లాల నేతలు, అనుబంధ విభాగాలతో పాటూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీతోనూ సమావేశాలను ముగించారు. ఇక, తాను స్వయంగా రంగంలోకి దిగే రీతిలో ప్రజలలోకి చొచ్చుకెళ్లే దిశగా కసరత్తు మొదలెట్టారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు, స్థానిక సమస్యల అధ్యయనంతో పాటూ తాము గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించే రీతిలో క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి 14 వారాల పాటుగా పార్టీ పరంగా ఉన్న 82 జిల్లాలో రోజుకు ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలను నేరుగా కలవడమే కాదు, వారి సమస్యలను తెలుసుకునే దిశగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఈ పర్యటనలో దూసుకెళ్లనున్నారు. చైన్నె, శివారులలో తాంబరం, మదుర వాయిల్, అంబత్తూరు, తిరువొత్తియూరు, కాంచీపురం, మదురాంతకం, తదితర ప్రాంతాలలో ప్రజలతో మమేకమయ్యే విధంగా క్షేత్ర స్థాయిలోకి పళణి సేన దూసుకెళ్లనున్నారు.
25న తిరుచ్చిలో డీఎంకే యూత్ భేటీ
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా ఈనెల 25న డీఎంకే యువజన సమావేశం జరగనుంది. ఆ విభాగం ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో 2026 ఎన్నికలలో డీఎంకే యూత్ పాత్ర గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మళ్లీ అధికారం, మళ్లీ సీఎంగా స్టాలిన్‌ను బాధ్యతల స్వీకరణ దిశగా డీఎంకే యువజనులు శ్రమించే విధంగా కార్యాచరణను సిద్ధం చేయనున్నారు.

కోర్టుకు సీమాన్ డుమ్మా