
ఢిల్లీకి గవర్నర్
● రాజ్యాంగాన్ని అపహస్యం చెయొద్దన్న సీఎం
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి గురువారం ఢిల్లీ వెళ్లారు. నాలుగురోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. దీంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పది ముసాయిదాల విషయంలో సుప్రీంకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గత నెలాఖరులో ఢిల్లీ వెళ్లిన ఆయన ఐదు రోజుల పాటూ అక్కడే ఉన్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటూ పలువురు మంత్రులు, న్యాయ నిపుణులు, అధికారులతో సమావేశమై ఇక్కడకు వచ్చారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం దూకుడు పెంచి వీసీల నియామక కసరత్తులను వేగవంతం చేసింది. ప్రభుత్వ పరిధిలోని వర్శిటీలకు వీసీల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన ముగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో ఈపది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు లేఖ రాస్తూ, 14 ప్రశ్నలను గురువారం రాష్ట్రపతి దౌప్రది ముర్ము సందించారు. రాష్ట్రపతి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే దిశగా సుప్రీం కోర్టు సైతం ఐదుగురు న్యాయమూర్తుల బృందాన్ని రంగంలోకి దించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రవి ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నాలుగు రోజులు ఢిల్లీ ఉంటారు. 18వ తేదీ ఆదివారం చైన్నెకు తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు చర్చ జరుగుతోంది.
రాజ్యాంగాన్ని కించపరచొద్దు
రాజ్యాంగ స్థానాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును ప్రశ్నించినట్టుందని సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ కేసుతో పాటూ ఇతర కేసులలో సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం ట్వీట్ చేశారు. రాజ్యాంగ స్థానాన్ని రాష్ట్రపతి ద్వారా అస్థిరపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు వివరణ కోరడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమిళనాడు గవర్నర్ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, అవమాన పరిచే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజలచే ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను తాజా పరిణామాలు ఏకం చేయనున్నట్టు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను బలహీన పరిచే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. తాజా పరిణామాలు సుప్రీంకోర్టును కూడా నేరుగా సవాలు చేస్తున్నట్టుందన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ న్యాయ పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. తమ శక్తినంతా ఏకం చేసి ఈ పోరాటంలో చేరుదామని, తమిళనాడు పోరుడుతుంది..తమిళనాడు గెలుస్తుందని వ్యాఖ్యలు చేశారు.