
కోర్సుల ఎంపికలో గందరగోళం వద్దు
తిరువళ్లూరు: ఇంటర్ తరువాత డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు కోర్సుల ఎంపికలో గందరగోళం చెంద వద్దని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ఇంటర్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ కోర్సుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కల్లూరి కనవు(కళాశాల కల) పేరుతో వినూత్న పథకాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ చేరాలనుకునే వారి కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఆలమాదిలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ హాజరై ప్రసంగించారు. కార్యక్రమానికి గుమ్మిడిపూండి, మీంజూరు, చోళవరం, పొన్నేరితో పాటు ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పాసైన తరువాత డిగ్రీ కోర్సుల ఎంపికలో చాలా మంది విద్యార్థులు గందరగోళం చెందుతూ ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థుల్లో వున్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు కోర్సుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన తరువాత ఇంజినీరింగ్, వైద్యం, లాతో పాటు ఇతర కోర్సులను చేయవచ్చన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ఉచిత టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు.