
కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన
తిరువళ్లూరు: తమపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇన్‌స్పెక్టర్ బాధితులనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కళ్లకు నల్లరిబ్బన్ కట్టుకుని నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా తిరుమళిసై ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆరీఫ్ ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి కుటుంబం అద్దెకు దిగింది. పది నెలల కిందట అద్దెకు దిగిన క్రమంలో ప్రతి నెలా రెండు వేల రూపాయలను చెల్లించారు. అయితే గత రెండు నెలల నుంచి ఉమామహేశ్వరి ఇంటి అద్దెను చెల్లించలేదు. ఇదే విషయంపై ఇంటి యజమానికి, ఉమామహేశ్వరికి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఉమామహేశ్వరి కుటుంబంపై ఆరీఫ్ దాడులకు దిగాడు. దాడిలో గాయపడ్డ బాధితులు న్యాయం కోసం వెళ్లవేడు పోలీసులకు పిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఇన్‌స్పెక్టర్ అయ్యప్పన్ భాదితులకు న్యాయం చేయకపోగా, పిర్యాదు చేసిన వారిపై బెదిరింపులకు దిగిన క్రమంలో బాధితులు బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల రిబ్బన్‌ను కళ్లకు కట్టుకుని నిరసనకు దిగారు. బెదిరింపులకు దిగుతున్న వెళ్లవేడు ఇన్‌స్పెక్టర్ అయ్యప్పన్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.