నేడు పన్నీరుశిబిరం భేటీ | - | Sakshi
Sakshi News home page

నేడు పన్నీరుశిబిరం భేటీ

May 15 2025 2:04 AM | Updated on May 15 2025 2:04 AM

నేడు పన్నీరుశిబిరం భేటీ

నేడు పన్నీరుశిబిరం భేటీ

సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరుసెల్వం, ఆయన మద్దతు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు గురువారం చైన్నెలో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎన్‌డీఏలో కొనసాగడం గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినానంతరం ఓ వైపు న్యాయపోరాటం చేస్తూ, మరోవైపు ప్రత్యేక శిబిరంగా పన్నీరుసెల్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో పయనించారు. అయితే, తాజాగా అన్నాడీఎంకే ఎన్‌డీఏలోకి రావడం, తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి అన్న ప్రకటనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇటీవల ప్రకటించడం పన్నీరు శిబిరాన్ని సందిగ్ధంలో పడేసింది. ఈ పరిస్థితులలో ఈ కూటమిలో కొనసాగాలా లేదా ప్రత్యామ్నయ మార్గం మీద దృష్టిపెట్టాలా అనే విషయంగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు పన్నీరుసెల్వం నిర్ణయించారు. దీంతో గురువారం జరిగే కీలక సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ విషయంగా ఆ శిబిరం ఎమ్మెల్యే వైద్యలింగం మాట్లాడుతూ పన్నీరుసెల్వం నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. తమను వదులుకోరని భావిస్తున్నామంటూ పరోక్షంగా ఎన్‌డీఏ కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తన బలాన్ని పెంచుకునే దిశగా బూత్‌ కమిటీల ఏర్పాటు, సమావేశాలకు నిర్ణయించడం గమనార్హం.

టాస్మాక్‌ స్కాంలో నోటీసులు

సాక్షి,చైన్నె: టాస్మాక్‌లో రూ.1000 కోట్ల స్కాం వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీలకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చైన్నెలోని టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంలో ఇటీవల మూడు రోజులు ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. రూ.1000 కోట్ల మేరకు స్కాం జరిగినట్టు ఈడీకి ఆధారాలు చిక్కాయి. అదే సమయంలో ఈడీ తదుపరి చర్యలకు బ్రేక్‌ వేసే విధంగా టాస్మాక్‌ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈడీ విచారణను అడ్డుకోవాలని కోరాయి. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈడీకి కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసును సీబీఐకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేశారు.

ఇంకుడు గుంతలు తప్పనిసరి

రాష్ట్ర ప్రభుత్వం కొత్త షరతులు

కొరుక్కుపేట: భూగర్భ జలాలను పెంచుకోవాలంటే వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే ఇంకుడుగుంతలు నిర్మాణం తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ప్రభుత్వం వార్షిక సమగ్ర ఆటోమేటెడ్‌ భూగర్భజల పర్యవేక్షణ ప్రవేశపెట్టింది . ఇందులో తొలి భారతీయ నగరంగా చైన్నె ఘనత సాధించింది. తదనంతరం చైన్నె నగరంలో భూగర్భ జాలాల స్థాయిని అంచనా వేయడానికి 15 జోన్లలో 200 భూగర్భ నీటి పర్యవేక్షణ పరికరాలు, 20 రెయిన్‌ గేజ్‌లను ఏర్పాటు చేశారు. ఒక కంపెనీ లక్ష లీటర్లు నీటిని తీసుకుంటే భూగర్భ జాలాల పట్టికను నిర్వహించడానికి సమానమైన నీటిని ఉపయోగించేందుకు దాని ప్రాంగణంలో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ అండ్‌ రీచార్జి నిర్మాణాలను నిర్మించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోందని వెల్లడించారు

ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందాలు

సాక్షి,చైన్నె: సరిహద్దు జ్ఞాన మార్పిడి, అనువర్తిత పరిశోధన, స్వచ్ఛమైన ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల వాణిజ్యకరణకు కొత్త అవకాశాలను కల్పించే విధంగా బుధవారం అంతర్జాతీయ ఒప్పందాలు జరిగాయి. ఐఐటీ మద్రాస్‌ ఎనర్జీ కన్సార్టియం, ఇంధన ఆవిష్కరణ, స్థిరత్వంపై పని చేయడానికి నికర–సున్నాశక్తి వ్యవస్థ పరివర్తనకు మద్దతు ఇచ్చే విధంగా యూకేకు చెందిన ఎనర్జీ సిస్టమ్స్‌ కాటాపుల్ట్‌ (ఈఎస్‌సీ)తో భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయి. 2015లో ఇన్నోవేట్‌ యూకే ద్వారా ప్రారంభించిన ఎనర్జీ సిస్టమ్స్‌ కాటాపుల్ట్‌, ఇన్నోవేట్‌ యూకే ద్వారా స్థాపించినట్టు ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్‌ డీన్‌ (గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌) ప్రొఫెసర్‌ రఘునాథన్‌ రంగస్వామి, ఇతర ప్రముఖుల సమక్షంలో వివరాలను ప్రకటించారు. ఐఐటీ మద్రాస్‌ తరఫున డీన్‌ (ఐసీఎస్‌ఆర్‌) ప్రొఫెసర్‌ మనుసంతానం, ఫ్యాకల్టీ హెడ్‌ ప్రొఫెసర్‌ సత్య శేషాద్రి, ది ఎనర్జీ కన్సా ర్టియం సీఈఓ నిఖిల్‌ తంబే, ఎనర్జీ సిస్టమ్స్‌ కాటాపుల్‌ తరఫున ఇన్నోవేటర్‌ సపోర్ట్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ సలహాదారు బ్రెండన్‌ ఓనీల్‌, న్యూఢిల్లీలోని బ్రిటిష్‌ హైకమిషన్‌ సీనియర్‌ నెట్‌ జీరో సలహాదారు బబితా శర్మ ఈ ఒప్పందాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఐటీ మద్రాస్‌లోని ది ఎనర్జీ కన్సార్టియం ఫ్యాకల్టీ హెడ్‌ ప్రొఫెసర్‌ సత్య శేషాద్రి మాట్లాడుతూ ఈ ఒప్పందాల గురించి, జ్ఞాన మార్పిడి, పరిశోధనల అంశాలను గురించి విశదీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement