
కనులపండువగా దశావతార ఉత్సవం
● నేడు అళగర్‌మలై వైపు స్వామివారు ● ముగింపు దశలో మదురైలో చిత్తిరై ఉత్సవాలు
సేలం: మదురై చిత్తిరై ఉత్సవాలు ముగింపుదశకు చేరాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రామరాయర్ మండపంలో కళ్లగర్ స్వామి వారి దశావతార ఉత్సవం కనులపండువగా జరిగింది. మదురైలో చిత్తిరై ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శైవం, వైష్ణవం ఐక్యతను చాటే విధంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో ఉత్సవాలు ముగిశాయి. ఇక, కళ్లలగర్(విష్ణు) ఆలయంలో ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. మంగళవారం తేనూరులో మండుగ మునికి శాప విమోచనం చేసినానంతరం కళ్లలగర్‌స్వామి రామరాయర్ మండపానికి చేరుకున్నారు. ఇక్కడ రాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం 6.30 గంటల వరకు దశావతార ఉత్సవం కనులపండువగా జరిగింది. మత్స్య, కూర్మ, నరసింహ, వామన, రామ సహా ఇతర అవతరాల ఉత్సవాల అనంతరం శ్రీకృష్ణ అవతారం సమయానికి సూర్యుడి ఉదయించాడు. రాత్రంతా భక్తులు నిద్రను పక్కన పెట్టి దశావతార మహోత్సవాన్ని కనులారా వీక్షించి స్వామి వారిని దర్శించుకున్నారు. చివరగా మోహిని అవతారంలో కళ్లగర్ స్వామి రామరాయర్ మండపం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాదిగా భక్తులు దశావతార ఉత్సవాన్ని తిలకించారు. ఇక్కడి నుంచి ఆనంద రాయర్ మండపం చేరుకుని భక్తులను స్వామి వారు కటాక్షించారు. అనంతరం తాల్లకులం మన్నర్ సేతుపతి మండపం చేరుకున్న స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. గురువారం ఇక్కడి నుంచి స్వామి వారు పుష్పపల్లకీలో భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం కరుప్పన్న స్వామి సన్నిధిలో పూజలు జరుగుతాయి. ఇక్కడి నుంచి అళగర్ మలైకు స్వామి వారు బయలుదేరి వెళ్తారు. శుక్రవారం అళగర్‌మలైకు చేరుకునే స్వామి వారికి విశిష్ట పూజలు జరుగుతాయి. మరుసటి రోజున జరిగే విశిష్ట పూజలతో మదురై చిత్తిరై ఉత్సవాలను ముగించనున్నారు. రెండు వారాలకు పైగా చిత్తిరై ఉత్సవాలతో మదురైలో ఆధ్యాత్మిక వాతావరణం మిన్నంటింది. తొలుత శివ నామ స్మరణ, చివరగా జరిగిన ఉత్సవాలలో గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక నగరం పులకించింది.

కనులపండువగా దశావతార ఉత్సవం

కనులపండువగా దశావతార ఉత్సవం

కనులపండువగా దశావతార ఉత్సవం

కనులపండువగా దశావతార ఉత్సవం

కనులపండువగా దశావతార ఉత్సవం

కనులపండువగా దశావతార ఉత్సవం

కనులపండువగా దశావతార ఉత్సవం