
సింహ వాహనంపై నరసింహుడి విహారం
– భక్తులతో కిక్కిరిసిన పెంచలకోన
రాపూరు: పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి యోగ నరసింహుడిగా సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు నృసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటలకు స్వామి, అమ్మవార్లతోపాటు ఆంజనేయుడికి పూలంగి సేవ చేపట్టారు. తదుపరి స్వామిని విశేషంగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చి క్షేత్రోత్సవం చేశారు. ఉదయం 11.30 గంటలకు క్రేన్ మండపంలో శ్రీవారితోపాటు ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి నవకలశ స్నపన తిరుమంజనం చేపట్టారు. భక్తులకు పలువురు పలుచోట్ల అన్నదానం చేశారు. వివిధ కులాలకు చెందిన సత్రాల్లో అన్నదానం చేపట్టారు.
యాగశాలలో చతుష్టానార్చన హోమం
పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఉదయం చతుష్టానార్చన హోమాన్ని టీటీడీ ఆగమ పండితులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే అగ్నిప్రతిష్ట, విశేష హోమాలు చేశారు. స్వామి తేజస్సు పెంచడంతోపాటు భక్తుల క్షేమ, ఆయురారోగ్యాల కోసం హోమం నిర్వహించినట్లు పండితులు చెప్పారు.
శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ
పెంచలకోనలోని రాత్రి 7 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి తిరుచ్చిలో కొలువుదీర్చారు. మేళతాళాలతో సహస్ర దీపాలంకరణ మండపంలోకి వేంచేపు చేశారు. అక్కడ 1,008 దీపాలు వెలిగించి ఊంజల్ సేవ చేశారు.
గరుడుడిపై నృసింహుని దివ్యదర్శనం
పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవను ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. శంఖు, చక్ర, వరద, అభయ హస్తాలు, వజ్రాభరణాలతో విశేషాలంకృతుడైన స్వామి వారు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడుడిపై కొలువుదీరి కోన తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.