
పూర్వ విద్యార్థుల కలయిక
పళ్లిపట్టు: ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు 23 ఏళ్ల తరువాత చదువుకున్న పాఠశాలలో కలుసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. పళ్లిపట్టు యూనియన్‌లోని కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001–2002 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న 65 మంది పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత చదువులు పూర్తిచేసి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో స్థిరపడ్డారు. విద్య, క్రమశిక్షణ నేర్పి జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చిన ఉపాధ్యాయులు, పాఠశాల మిత్రులను కలుసుకోవాలన్న కొందరు పూర్వవిద్యార్థుల ఆశయానికి వాట్సాప్ తోడు కావడంతో పూర్వ విద్యార్థులను ఏకం చేసింది. ఆదివారం పాఠశాల వేదికగా నిర్వహించిన అపూర్వ కలయిక కార్యక్రమంలో పలు ప్రాంతాల్లో కుటుంబాలతో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు చేరుకుని తమ తరగతి మిత్రులను కలుసుకుని ఆనందంతో మనసువిప్పి మనుసులో మాటను పంచుకున్నారు. అదే సమయంలో కార్యక్రమానికి హాజరైన పూర్వ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి ఆశీస్సులు పొందారు. పూర్వ విద్యార్థుల ద్వారా పాఠశాలకు రూ.20 వేల విలువైన సామగ్రిని వితరణగా అందజేశారు. సాయంత్రం వరకు పాఠశాల క్రీడామైదానంలో ఆటలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు.