
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
పళ్లిపట్టు: అంగన్‌వాడీ ఆర్గనైజర్ పోస్టులకు చివరి రోజైన బుధవారం మహిళలు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లాలోని 14 మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా వున్న 305 అంగన్‌వాడీ ఆర్గనైజర్ల పోస్టులకు సంబంధించి పది రోజుల నుంచి దరఖాస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా యూనియన్ స్థాయిలో ఖాళీగా వున్న పోస్టులను సంబంధించి ఆయా యూనియన్ చిన్నారుల సంరక్షణ కేంద్రాల్లో దరఖాస్తులను మహిళలు సమర్పించారు. ప్లస్‌టూ విద్యార్హతగా వున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించగా, డిగ్రీలు చదువుకున్న మహిళలు సైతం అంగన్‌వాడీ పోస్టులకు ఆసక్తి చూపారు. తిరుత్తణి మండలంలోని 13 పోస్టులకు 560 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పళ్లిపట్టు మండలంలోని 8 పోస్టులకు మొత్తం 360 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు చిన్నారుల సంరక్షణ కేంద్రాల్లో మహిళలు పోటెత్తి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు చేసుకున్నారు. వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు, కులగణన ప్రకారం మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.