
చైన్నె శివార్లలో స్తంభించిన ట్రాఫిక్
●కిక్కిరిసిన రహదారులు ● టోల్‌గేట్ల వద్ద బారులుదీరిన వాహనాలు ● తప్పని ట్రాఫిక్ కష్టాలు
మాట్లాడుతున్న మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, అరక్కోణంలో సిద్ధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
సాక్షి, చైన్నె: దీపావళి పండుగను ముగించుకుని స్వస్థలాల నుంచి జనం చైన్నెకు తిరుగు ప్రయణమయ్యారు. ఫలితంగా సోమవారం అర్ధరాత్రి నుంచే జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద వాహనాలు కిలో మీటర్ల కొద్ది బారులుదీరాయి. ఏ రోడ్డు చూసినా వాహనాలతో నిండిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. వివరాలు.. చైన్నెలో ఉద్యోగ, వివిధ పనులు నిమిత్తం నివాసం ఉంటున్న వారు ఆదివారం దీపావళి పర్వదినాన్ని తమ కుటుంబాలతో జరుపుకునేందుకు స్వస్థలా లు, స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. మూడు రోజుల సెలవులను ముగించుకుని ప్రజలు మంగళవారం మళ్లీ చైన్నెకు చేరుకున్నారు. చైన్నె వైపుగా ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు కదిలాయి. ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలలో వెళ్లి వారంతా ఒక్క సారిగా తిరుగు పయనం కావడంతో అర్ధరాత్రి నుంచి అన్ని టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులుదీరాయి. ఇక ఉదయాన్నే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు చైన్నె వైపు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఈ బస్సులన్నీ ఉదయాన్నే నగర శివారుల్లోకి ప్రవేశించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య తప్పలేదు.
వాహనదారుల ఇక్కట్లు
తాంబరం బైపాస్‌రోడ్డు మీదుగా కోయంబేడుకు వెళ్లే వాహనాలు పెరుంగళత్తూరు, వండలూరు, గూడువాంజేరి వరకు కిలో మీటర్ల కొద్ది బారులుదీరాయి. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు వాహనాలకు గంట సమయం పట్టింది. చెంగల్పట్టు సమీపంలోని పరనూరు టోల్ గేట్ల వద్ద అయితే కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాల్సి వచ్చింది. ట్రాఫిక్ రద్దీతో పలువురు ఆయా మార్గాలకు సమీపంలోని రైల్వే స్టేషన్‌ను ఆశ్రయించి ఎలక్ట్రిక్ రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు వెళ్లారు. స్కూళ్లు సైతం ప్రారంభం కావడంతో పిల్లలను బడికి పంపించడం కోసం తల్లిదండ్రులు పరుగులు తీశారు. ఈ ట్రాఫిక్ కష్టాలతో తాంబరం – కోయంబేడు జీఎస్‌టీ రోడ్డు, గిండి – ప్యారిస్ వరకు అన్నాసాలై, మైలాపూర్, అడయార్ తదితర మార్గాల్లో వాహనాలు నత్తనడకన సాగాయి. కోయంబేడు బస్టాండ్, ఎగ్మూర్, సెంట్రల్ రైల్వే స్టేషన్లు జనంతో కిట కిటలాడాయి. మధ్యాహ్నం వరకు అనేక మార్గాల్లో ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. దక్షిణ తమిళనాడు నుంచి చైన్నె వైపుగా ఒక్క రోజు 45 వేల వాహనాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.