ఇలాంటి పరిస్థితి
తమిళసినిమా: చేతిలో చిత్రాలు ఉన్నా లేకపోయినా వార్తల్లో ఉండే నటి సమంత. అదీ ఆమె క్రేజ్. స్టార్ హీరోలతోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ మంచి ఫామ్‌లో ఉన్న సమంత అనూహ్యంగా మయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో ఆమె జీవితం వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను కష్టాల్లో పడింది. అయితే ఆ వ్యాధిని వైద్య పరంగా ధైర్యంగా ఎదుర్కొనే పనిలో ఉన్నారు. అలాంటి సమంత ఇటీవల తన అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా ముచ్చటించారు. తాను పడుతున్న శ్రమ మీరు అనుకున్నంత సులభంగా లేదని పేర్కొన్నారు. మయోసిటీస్ వైద్యంలో భాగంగా మోతాదుకు మించిన మందులు వాడడంతో ఇతర సమస్యలు ఏర్పడడంతో చాలా కష్టపడ్డానని చెప్పారు. ఈ సందర్భంగా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా సతమతమయ్యే యువతకు తాను చెప్పదలచుకున్నది ఏమిటంటే మా జీవితం ఇలా అయిపోయింది ఏమిటి అని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. కష్టాలనైనా, సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఆ ధైర్యంతో మనల్ని కొన్ని సమయాల్లో దృఢంగా మారుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 25 ఏళ్ల వయసులో తానీ స్థితిని ఎదుర్కొంటానని ఊహించలేదన్నారు. ఇన్ని సమస్యలను తాను ఎదుర్కోగలనా అనే సందేహం కలిగిందన్నారు అయితే ఎలాంటి దాన్నైనా నిజాయితీగా ఎదుర్కొంటే ముందుకు సాగగలం అని సమంత పేర్కొన్నారు. కాగా ఖుషి చిత్రం నూతనోత్సాహంతో ఉన్న ఈమె ప్రస్తుతం ఒక మలయాళం చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.