
శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను తీసుకొస్తున్న ఆలయ చైర్మన్, ఈఓ
● కాణిపాకంలో నయనానందకరంగా బ్రహ్మోత్సవాలు ● మూషిక వాహనంపై విహరించిన లంబోదరుడు ● రంజింపజేసిన సాంస్కృతిక ప్రదర్శనలు
కాణిపాకం(యాదమరి): కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం మూలస్థానంలోని స్వయంభు వినాయకస్వామికి గంధం, విశేష ద్రవ్యాలతో అభిషేకం అనంతరం సుందరంగా అలంకరించి పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనతరం మూషిక వాహన ఉభయదారులకు ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందించారు. రాత్రి తొమ్మిది గంటలకు మూషిక వాహన సేవ ప్రారంభమైంది. ముందుగా సిద్ధి, బుద్ధి సమేత గణనాఽథుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపుగా అలంకార మండపంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అధికారులు, ఉభయదారులు భుజాలపై మోసుకుంటు ఊరేగింపుగా తీసుకెళ్లి మూషిక వాహనంలోఅధిష్టింపజేశారు. తదుపరి మేళతాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో, పుర వీధుల్లో ఊరేగింపు నయనానందకరంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర నీరజనాలు సమర్పించారు.
శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయల నుంచి పట్టువస్త్రాలు
కుమారునికి తండ్రి ఆలయాల నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు. గురువారం ఉదయం శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి ఈఓ లవన్న, బోర్డు సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, విజయలక్ష్మి పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. మధ్యాహ్నం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నుంచి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈఓ సాగర్ బాబు, బోర్డు సభ్యులు స్వామివారి పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. వారికి కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ వస్త్రాలను స్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
నేడు చిన్న, పెద్దశేష వాహన సేవలు
బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై, రాత్రి పెద్ద శేష వాహనంపై ఊరేగనున్నారు. వేకువజామున ప్రత్యేక అభిషేకపూజల అనంతరం భక్తులకు దర్శనం ఉంటుంది.

చిన్నారుల నృత్య ప్రదర్శన