
అరెస్టయిన ఆక్యుపంక్చర్ వైద్యులు
తిరువళ్లూరు (తమిళనాడు): ఆన్‌లైన్ వ్యాపారం పేరిట రూ.1.25 కోట్లు మోసం చేసిన కేసులో ఇద్దరు ఆక్యుపంక్చర్ డాక్టర్లు సహా ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మదురై జిల్లా పసుమలై ప్రాంతానికి చెందిన కుమారప్రభు, అతని భార్య మహాలక్ష్మి ఆక్యుపంక్చర్ డాక్టర్లుగా క్లినిక్ నడుపుతున్నారు.
తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని కుండ్రత్తూరులో క్లినిక్‌ను ఏర్పాటు చేసి వారంలో ఒక రోజు వైద్యసేవలను అందిస్తున్నారు. ఈ క్లినిక్‌లో ఆవడి పోలీసు కానిస్టేబుల్ దినేష్‌కుమార్ భార్య షర్మిల పనిచేస్తున్నారు. వీరు ఆక్యుపంక్చర్ డాక్టర్‌గా క్లినిక్ నిర్వహిస్తూనే ఆన్‌లైన్ వ్యాపారం పేరిట దీపావళీ చీటి, వేలం చిట్టీలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారంలో తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలూకా దేవంపట్టు గ్రామానికి చెందిన సౌమ్య(26) తదితరులు చేరారు.
వీరు పలువురి వద్ద రూ.1.25 కోట్లు వసూలు చేశారు. చిట్టీలు పూర్తయినా నగదు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు తిరువళ్లూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మోసం చేసినట్టు తేలడంతో ఆక్యుపంక్చర్ డాక్టర్లు కుమార ప్రభు, అతడి భార్య మహాలక్ష్మి, వారి వద్ద పనిచేసిన పోలీసు కానిస్టేబుల్ భార్య షర్మిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.