చిన్నారిపై లైంగికదాడికి యత్నం
చౌటుప్పల్ : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్‌మిల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు.
లడ్డూ ఇప్పిస్తామని చెప్పి..
చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్‌లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
లడ్డూ ఆశ చూపి తమ వెంట
తీసుకెళ్లిన ఇద్దరు నిందితులు
బాలిక రోదనలు విని అప్రమత్తమైన తల్లి
పక్కింటి బాలిక సమాచారంతో
నిందితుల ఇంట్లో చిన్నారి గుర్తింపు


