సాక్షి, పుట్టపర్తి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నా అడిగే అధికారులు లేరు. ఎవరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోరు. ఉన్నతాధికారులకు విన్నవిస్తే ఆదేశాలు జారీ చేస్తున్నారు.. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. చర్యలు తీసుకోలేదా అని ప్రశ్నిస్తే.. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు అధికారులే చెబుతుండటం గమనార్హం. పుట్టపర్తి మండలం పెడపల్లిలో ఏడాదిన్నరగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. టీడీపీకి చెందిన ‘ఖల్ నాయక్’ భూ దందాకు పాల్పడుతున్నాడు. ఓ మాజీ మంత్రి అండదండలతో వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఖాళీ స్థలాలన్నీ కాజేస్తున్నాడు. కబ్జా చేయడంతో పాటు అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నాడు. కొన్ని భవనాలకు రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. అక్రమ కట్టడాల గురించి గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకపోవడం గమనార్హం.
సీజ్ చేసి చేతులు దులుపుకొని..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డిజిటల్ లైబ్రరీ కోసం కేటాయించిన స్థలంలో మిగులు భూమిపై ‘ఖల్ నాయక్’ కన్నేసి కాజేసి అక్రమంగా కట్టడం నిర్మించాడు. దీనిపై కలెక్టరేట్ వరకు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే అక్రమ కట్టడాన్ని కూల్చేయాలని ఆర్డీఓకు కలెక్టర్ నుంచి ఆదేశాలు కూడా అందాయి. అయితే ఆ తర్వాత రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పదే పదే వాయిదా వేస్తూ వచ్చారు. కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. ఇటీవల ఉన్నతాధికారుల నుంచి సమస్య రాకుండా ఉండేందుకు సీజ్ చేసి చేతులు దులుపుకొన్నారు.
రస్తాలో మరో అక్రమ నిర్మాణం
పెడపల్లిలో ‘ఖల్ నాయక్’ నేతృత్వంలో మరో అక్రమ కట్టడం నిర్మితమవుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు వ్యక్తి పట్టా పొంది నిర్మాణం చేపట్టారని సమాధానం చెప్పినట్లు తెలిసింది. అది రస్తా పొరంబోకు అని.. తన స్థలానికి వెళ్లేందుకు మార్గం లేకుండా అక్రమంగా కడుతున్నట్లు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై విచారణ చేయాల్సిన రెవెన్యూ అధికారులు అది గ్రామ కంఠంగా చెబుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు ఇవ్వకుండా..
పెడపల్లిలో అక్రమ నిర్మాణాల గురించి ఎవరు ప్రశ్నించినా.. రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా కోరాలని చెబుతున్నారు. అయితే మాజీ మంత్రి ఒత్తిళ్లతో పెడపల్లిలో అక్రమాల వైపు అధికారులు వెళ్లకుండా ఉన్నట్లు తెలిసింది. ఏదైనా ఉంటే ‘మాజీ మంత్రి’ దగ్గర సెటిల్ చేసుకోవాలని చెబుతుండటం గమనార్హం.
కబ్జాలు కొనసాగిస్తున్న తమ్ముడు
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ కట్టడాల నిర్మాణం
మాజీ మంత్రి అండతో
రెచ్చిపోతున్న వైనం
చేష్టలుడిగి చూస్తున్న రెవెన్యూ అధికారులు


