
అగ్రిగోల్డ్ బాధితుల మొర ఆలకించండి
ఆత్మకూరు: ‘మా సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మొర ఆలకించాలి’ అని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని బైపాస్‌రోడ్డులో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లతో ఆదివారం సాయంత్రం పీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో 10 లక్షల బాధిత కుటుంబాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.906 కోట్లు జమైనట్లు తెలిపారు. 143 ఏజెంట్ కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో అందినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ సమస్యను పొందుపరిచిందని, ఆ మేరకు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సమస్య పరిష్కారంలో కాలయాపన చేస్తే మరోసారి ఉద్యమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చౌడయ్య, మునీర్, సురేష్, శివయ్య, సుధాకర్, అజయ్, నాగేశ్వరరావు, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.