
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
● 34 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నమ్మకంగా ఉంటూ నగలు కాజేసిన ఘటనలో నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. వెంగళరావ్‌నగర్ ఏ బ్లాక్‌లో విశ్రాంత రైల్వే ఉద్యోగులు వెంకటేశ్వర్లు, కొండమ్మ దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. చిన్నకుమారుడు ప్రసన్నకుమార్‌కు వివాహం నిశ్చయమైంది. అతను గతనెల 29వ తేదీన బీరువాలోని తన బంగారు బ్రాస్‌లెట్, రెండు చైన్‌ల కోసం చూడగా అవి కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లు ఈనెల 4వ తేదీన వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై డి.విజయకుమార్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. పనిచేసే గణపతి నిందితుడని తేలడంతో ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. వెంగళరావునగర్ ప్రాంతానికి చెందిన గణపతి కొంతకాలంగా వెంకటేశ్వర్లు ఇంట్లో పనిచేస్తూ నమ్మకంగా ఉండేవాడు. గతనెల 28వ తేదీన యజమానులు ఇంటి బయట ఉండగా బీరువాలోని 34 గ్రాముల రెండు బంగారు గొలుసులు, బ్రాస్‌లెట్‌ను అపహరించాడు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపి సిబ్బందిని డీఎస్పీ సింధుప్రియ అభినందించారు.