
చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమెర్ మరో రౌండ్ మిగిలి ఉండగానే... చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. జోర్డెన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్)తో గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను విన్సెంట్ కీమెర్ 59 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఎనిమిదో రౌండ్ తర్వాత కీమెర్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
నాలుగు గేముల్లో నెగ్గిన కీమెర్, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, కార్తికేయన్ మురళీ 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో కీమెర్ ఓడిపోయినా... అర్జున్, కార్తికేయన్ తమ గేమ్‌ల్లో విజయం సాధించినా జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ను అందుకోలేకపోతారు.
ఎనిమిదో రౌండ్‌లో అర్జున్–విదిత్ గేమ్ 32 ఎత్తుల్లో; నిహాల్ సరీన్–కార్తికేయన్ మురళీ గేమ్ 61 ఎత్తుల్లో; అవండర్ లియాంగ్ (అమెరికా)–అనీశ్ గిరి (నెదర్లాండ్స్) గేమ్ 37 ఎత్తుల్లో; ప్రణవ్ (భారత్)–రే రాబ్సన్ (అమెరికా) గేమ్ 35 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.