Rewind 2021: మధుర క్షణాలు.. ఈసారి మనకు ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం, కాంస్యం!

Rewind 2021: India Historic Moments In Olympics And Paralympics - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌.. భారత క్రీడాకారులు

Tokyo Olympics: ఆధునిక ఒలింపిక్స్‌ 1896లో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వాటిలో భారతదేశానికి సంబంధించినంత వరకు మైలురాయిలాంటి విజయాలను అందించిన సంవత్సరంగా 2021 మిగిలిపోతుంది. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్‌ కరోనా ప్రాబల్యం కారణంగా వాయిదా పడి, నిబంధనల మేరకు చివరకు 2021లో నిర్వహించారు.

ఈ ఒలిపింక్స్‌లో మన దేశం స్వర్ణం, రజతం, కాంస్యం.. ఇలా మూడు రకాల పతకాలను గెలుచుకుని ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఆట తీరుపై అంచనాలను పెంచింది. మన క్రీడాకారులు కూడా ఎంతో ప్రతిభను ప్రదర్శించి విజయాలను చేజిక్కించుకున్నారు. 

బజరంగ్‌ పూనియా 
హరియాణా జజ్జర్‌ ప్రాంతానికి చెందిన బజరంగ్‌ అరవై అయిదు కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన నియజ్‌ బెకోవన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. 

నీరజ్‌ చోప్రా
స్వాతంత్య్ర భారత చరిత్రలో అథ్లెటిక్స్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని ఒలింపిక్స్‌లో సాధించిన క్రీడాకారుడిగా నీరజ్‌ రికార్డ్‌ సృష్టించాడు. అంతగా గుర్తింపులేని జావెలిన్‌ త్రో క్రీడలో అంతర్జాతీయ దిగ్గజాలను సైతం కాలదన్ని స్వర్ణపతాకంతో భారతీయ కలలను నెరవేర్చాడు. హరియాణా పానిపట్టు జిల్లాలోని ‘ఖంద్రా’గ్రామంలో పదిహేడు మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో పెద్దబ్బాయి అయిన నీరజ్‌ తన కలలను మాత్రమే కాక భారతీయుల కలలనూ నిజం చేశాడు. 

మీరాబాయి చాను
మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన మీరాబాయి 2021, ఆగస్ట్‌ 5న టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ త్రివర్ణ పతాకం రెపరెలాడేలా చేసింది. నలభై తొమ్మిది కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలో స్నాచ్‌ విభాగంలో ఎనభై ఏడు కిలోలను, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగంలో 115 కిలోలను ఎత్తి మొత్తం 202 పాయింట్లతో భారత్‌కు వెండి పతకాన్ని ఖాయం చేసింది. ఇరవై ఆరేళ్ల మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో భారత విజయయాత్రకు శ్రీకారం చుట్టింది. 

రవికుమార్‌ దహియా
టోక్యో ఒలింపిక్స్‌లో యాభై ఏడు కిలోల ఫ్రీ స్టయిల్‌ రెజ్లింగ్‌లో రజత పతకాన్ని సాధించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతాక విజేతగా, ఏషియన్‌ చాంపియన్‌గా మంచి ట్రాక్‌ రికార్డ్‌ను సొంతం చేసుకున్న దహియా ఒలింపిక్స్‌లోనూ అదే పరంపరను సాగించడం విశేషం. 

లవ్‌లీనా బొర్గొహెన్‌
అస్సాంలోని గోలాఘాట్‌లో జన్మించిన లవ్‌లీనా కిక్‌బాక్సింగ్‌తో కెరీర్‌ మొదలుపెట్టింది. టోక్యో ఒలిపింక్స్‌లో అరవై తొమ్మిది కిలోల బాక్సింగ్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. 

పి.వి. సింధు
బాడ్మింటన్‌ క్రీడలో చెరిగిపోని ముద్రవేసిన తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట సింధు ఈసారి కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్‌ సృష్టించింది. 

పారాలింపిక్స్‌లో భారతీయులు
శారీరకంగా, మానసికంగా ఉన్న సవాళ్లు సంకల్పాన్ని ఉసిగొల్పి, దీక్షగా మలచి, పట్టువిడువని సాధనగా మార్చితే విజయం పతకంగా ఇంటికి రాదూ! అలా మిగిలిన ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే క్రీడాసంరంభమే.. రెండో ప్రపంచానంతరం ప్రారంభమైన పారాలింపిక్స్‌. 2021 సంవత్సరపు ఈ క్రీడల్లో మన దేశ పతాకం రెపరెపలాడింది. మొత్తం 17 మంది క్రీడాకారులు 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు సాధించి మన సత్తా చాటారు. ఆ విజేతలు వీరే.. 

అవనీ లేఖరా
రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగి నడుం కింది భాగం చచ్చుబడిపోయి.. వీల్‌చైర్‌కే అంకితమైంది. అయినా అధైర్యపడక మొక్కవోని దీక్షతో షూటింగ్‌ నేర్చుకుని భారత్‌ తరపున పారాలింపిక్స్‌కి ఎన్నికైంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొదటిసారే రెండు పతకాలను సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డ్‌ సృష్టించింది.  

తంగవేలు మరియప్పన్‌
తమిళనాడులోని సేలం జిల్లా, పెరియనడాగపట్టి అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన తంగవేలు ఓ బస్సు ప్రమాదంలో కుడికాలిని పోగొట్టుకున్నాడు. అయినా పాఠశాల స్థాయి నుంచే హైజంప్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. ఓవైపు ఆ క్రీడను సాధన చేస్తూనే మరో వైపు జీవనాధారం కోసం పేపర్‌బాయ్‌గా పనిచేసేవాడు. రియో పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ గెలుపునే టోక్యో పారాలింపిక్స్‌లోనూ కొనసాగించి హైజంప్‌లో రెండో విడతా బంగారు పతకాన్ని సాధించాడు.

ప్రమోద్‌ భగత్‌
బిహార్‌లోని హాజీపూర్‌లో జన్మించిన ప్రమోద్‌ పోలియోతో ఎడమ కాలిని కోల్పోయాడు. అయితే క్రికెట్‌ పట్ల ప్రేమతో ఎప్పుడూ గ్రౌండ్‌లో గడుపుతూ తన వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంగా మలచుకునే ప్రయత్నం చేసేవాడు. ఆ తర్వాత తన మేనత్తతో భువనేశ్వర్‌ వెళ్లి అక్కడే తన దృష్టిని బాడ్మింటన్‌ వైపు మరల్చాడు. నాలుగుసార్లు బాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ సాధించి వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ప్రశంసలు పొందాడు. అయితే టోక్యో పారాలింపిక్స్‌తో తొలిసారి బాడ్మింటన్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఈ పోటీలో పాల్గొని స్వర్ణపతకాన్ని సాధించి దేశ కీర్తిని చాటాడు. 

సుమిత్‌ 
కుస్తీలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు గన్న సుమిత్‌ 2014లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో ఎడమకాలిని పోగొట్టుకున్నాడు. తన దృష్టిని అథ్లెటిక్స్‌ అందులోనూ ‘జావెలిన్‌ త్రో’ వైపు మరల్చి తీవ్రమైన సాధన చేశాడు. ఆ పోటీలో పాల్గొనెందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి టోక్యో పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 

దేవేంద్ర ఝఝరియా
రాజస్థాన్, చుంచ జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టిన దేవేంద్ర ఎనిమిదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కాలిపోవడంతో దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఒంటి చేత్తోనే ఆడగలిగిన క్రీడ జావెలిన్‌ త్రోని ఎంపిక చేసుకొని పట్టుదలతో ప్రాక్టీస్‌ చేశాడు. ఏథెన్స్‌ పారాలింపిక్స్‌లో ప్రపంచరికార్డును సృష్టించేంతగా ఎదిగాడు. తర్వాత రియో పారాలింపిక్స్‌లో, ప్రస్తుత టోక్యో పారాలింపిక్స్‌లో కూడా విజేతగా నిలిచి మూడు పారాలింపిక్స్‌ పతకాలు గెలుచుకున్న ఏకైక భారతీయుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతనికిప్పుడు 40 ఏళ్లు. ఆ వయసులో ఈ విజయం నిజంగా విశేషం. 

కృష్ణ నాగర్‌
రాజాస్థాన్‌కు చెందిన కృష్ణ .. హార్మోన్ల లోపం వల్ల మరుగుజ్జుగా ఉండిపోయాడు. కానీ బాడ్మింటన్‌ పట్ల ఆసక్తితో దాన్ని నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని సాధించి మరుగుజ్జుతనం తన లక్ష్యసాధనకు ఆటంకం కాదని నిరూపించాడు. 

మనీష్‌ నర్వాల్‌
హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన మనీష్‌ పుట్టుకతోనే కుడిచేయిపై పట్టును కోల్పోయి, ఒంటి చేతితోనే జీవితాన్ని నెట్టుకు రాసాగాడు. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే ఈ 19ఏళ్ల కుర్రాడు తన లోపాన్ని దృష్టిలో పెట్టుకుని తన ఏకాగ్రతను షూటింగ్‌ వైపు మళ్లించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. 

భావినా పటేల్‌ 
గుజరాత్, మెహసాగా జిల్లాకు చెందిన భావినా పోలియో వల్ల కాళ్లను పోగొట్టుకుని చక్రాల కుర్చీకే పరిమితం అయింది. ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి టేబుల్‌ టెన్నిస్‌ను నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుని ఈ క్రీడలో పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 
 ఈ క్రీడాకారిణి వయసు ఎంతో తెలుసా.. పందొమ్మిదేళ్లు మాత్రమే.

సమీర్‌ బెనర్జీ
భారతీయ మూలాలున్న ఈ అమెరికన్‌ యువకుడు ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ జూనియర్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అరుదైన రికార్డ్‌ సృష్టించాడు. సమీర్‌ తండ్రి అస్సాం రాష్ట్రీయుడు. తల్లిది ఆంధ్రప్రదేశ్‌. 

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా
ప్రతిష్ఠాత్మక నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని 2021 గాను గెలుచుకున్న సాహితీవేత్త అబ్దుల్‌ రజాక్‌. టాంజానియాకు చెందిన ఆయన 1994లో ‘ప్యారడైజ్‌’ నవలతో సాహిత్య ప్రస్థానం మొదలుపెట్టారు. ఆయన రచనల్లో వలసవాదపు మూలాలు, తూర్పు ఆఫ్రికా దేశాల్లోని ఆధునికత తాలూకు విధ్వంసం, సాంస్కృతిక సంఘర్షణలు కనిపిస్తాయి. 1948లో, జాంజిబార్‌లో జన్మించిన అబ్దుల్‌ 1960వ దశకంలో శరణార్థిగా ఇంగ్లండ్‌కు చేరాడు. అనంతరం అక్కడే ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి, రిటైర్‌ అయ్యాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top