
ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తదుపరి కెరీర్ విషయంలో శరవేగంగా పావులు కదుపుతున్నాడు. భారత క్రికెట్‌తో తెగదెంపులు జరిగిపోవడంతో ప్రపంచవాప్తంగా ఉన్న ప్రధాన లీగ్‌ల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయా లీగ్‌ల్లో తనకు నచ్చిన ఫ్రాంచైజీలతో మంతనాలు జరుపుతున్నాడు.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, ద హండ్రెడ్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ లీగ్‌ల్లో వేర్వేరు ఫ్రాంచైజీలతో డీల్స్ కూడా కుదిరినట్లు సమాచారం. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ప్రముఖ ఫ్రాంచైజీతో కూడా టాక్స్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ లీగ్‌ల్లో ఏ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరినా అశ్విన్ ప్లేయర్ కమ్ కోచ్‌గా ద్విపాత్రాభినయం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇలా చేస్తే తనకు కోచింగ్ అనుభవం కూడా వస్తుందని యాష్ భావిస్తున్నాడట. శరీరం సహకరించని రోజు ఆటగాడి పాత్రకు పుల్‌స్టాప్ పెట్టి కోచ్‌గా కొనసావచ్చన్నది అతడి మనోగతం కావచ్చు. క్రికెట్ జీనియస్‌గా పేరున్న అశ్విన్ ఇదివరకే తన పేరట యూట్యూబ్ ఛానల్‌ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అతను ప్రపంచ క్రికెట్‌పై తన విశ్లేషణలను అందిస్తుంటాడు.
37 ఏళ్ల ఆశ్విన్ ఆగస్ట్ 27న ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. భారత క్రికెట్‌తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు. బీసీసీఐ నియమాల ప్రకారం.. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి. విశ్వవ్యాప్తంగా లీగ్‌ల్లో ఆడేందుకే యాష్ ఐపీఎల్‌కు కాస్త త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడని వినికిడి.