పారిస్‌లో స్వర్ణమే లక్ష్యం: పీవీ సింధు

PV Sindhu: My eyes On Gold In Paris Olympics, Says After  History Tokyo - Sakshi

పీవీ సింధు ఆత్మవిశ్వాసం

తాజా పతకం కుటుంబానికి అంకితం

మీడియాతో స్టార్‌ షట్లర్‌ ముఖాముఖీ

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళ... ఈ ఘనత సాధించిన క్షణాలను పూసర్ల వెంకట (పీవీ) సింధు ఇంకా ఆస్వాదిస్తోంది. కాంస్య పతకం గెలుచుకున్న తర్వాతి రోజూ కూడా ఆమెపై అభినందనల వర్షం ఆగడం లేదు. ఒకవైపు ఇంటర్వ్యూలు, మరోవైపు విజయం సాధించిన క్షణం నుంచి వచ్చిన ‘కంగ్రాట్స్‌’లకు కృతజ్ఞతలు... ‘రియో’లో రజతం సాధించిన నాటి నుంచి ‘టోక్యో’లో మరో పతకం గెలిచే వరకు సాగిన తన ప్రయాణాన్ని ఆమె గుర్తు చేసుకుంది. ఈ క్రమంలో టోక్యో నుంచి ఆమె భారత మీడియాతో ‘జూమ్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో ముచ్చటించింది. ఈ సమావేశం వివరాలు, విశేషాలు ఆమె మాటల్లోనే...

రెండో ఒలింపిక్‌ పతకం సంబరంపై..
చాలా సంతోషంగా ఉంది. ఒక పతకం గెలుచుకున్న క్షణమే ఎంతో గర్వకారణం అంటే వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో నాకు ఆ అవకాశం రావడం నిజంగా నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. పతకం సాధించిన క్షణంలో కొద్దిసేపు నాకు మాటలు రాలేదు. కోచ్‌ పార్క్‌ అయితే కన్నీళ్లు పెట్టేశారు. 5–6 క్షణాలు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే అలా అరిచేశాను. నా భావోద్వేగాలన్నీ ఒకేసారి బయటకు వచ్చాయి.

మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌పై... 
సెమీఫైనల్‌ ముగిసిన తర్వాత ఎంతో బాధపడ్డా. ఏడుస్తుంటే ఇంకా ఆట పూర్తి కాలేదంటూ కోచ్‌ వచ్చి ఓదార్చారు. కాంస్యం గెలుచుకోవడానికి, నాలుగో స్థానానికి మధ్య చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు. అందుకే 100 శాతం బాగా ఆడాలనే దృక్పథంతో వెళ్లా. నాలాగే నా ప్రత్యర్థి కూడా సెమీస్‌లో ఓడిన బాధతోనే ఉంటుంది కాబట్టి ఇద్దరి మానసిక పరిస్థితి ఒకేలా ఉంటుంది. అందుకే కొత్తగా మొదలు పెట్టి విజయం సాధించగలిగా.  

గచ్చిబౌలి స్టేడియానికి మారడంపై..
ఇందులో వివాదం ఏమీ లేదు. టోక్యో ఒలింపిక్స్‌ జరిగే స్టేడియంలో షటిల్‌ గమనాన్ని గాలి ప్రభావితం (డ్రిఫ్ట్‌) చేస్తుంది కాబట్టి అదే తరహా వాతావరణంలో సాధన చేస్తే బాగుంటుందని, దానికి సంబంధించి సమస్య ఎదుర్కోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా. అది మంచి ఫలితాన్నిచ్చింది. ఫిబ్రవరిలో అక్కడికి మారిన తర్వాత ఆ విషయంలో ఎంతో సాధన చేశా.  

‘రియో’ నుంచి ‘టోక్యో’ వరకు ప్రయాణం..
ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా. కొన్ని మ్యాచ్‌లు గెలిస్తే మరికొన్ని అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే కరోనా కారణంగా వచ్చిన పరిస్థితులు చూసి చాలా బాధ వేసింది. ఆట కోణంలో చూస్తే పలు టోర్నీలు రద్దయ్యాయి. ఇలాంటి స్థితిలోనూ శిక్షణను కొనసాగించాను. ఒలింపిక్‌ పతకమే లక్ష్యంగా పని చేశాను. అన్ని సమయాల్లో నా వెంట నిలిచిన కుటుంబ సభ్యులకు ఈ పతకం అంకితం. చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ కూడా మెసేజ్‌ ద్వారా అభినందించారు. 

వేర్వేరు కోచ్‌లతో పని చేయడంపై...
రియో ఒలింపిక్స్‌ తర్వాత ముగ్గురు కోచ్‌లు ముల్యో, కిమ్, పార్క్‌లతో నేను కలిసి పని చేశాను. శిక్షణలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి. అందరి నుంచీ ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నా. సరిగ్గా చెప్పాలంటే ఒక ప్లేయర్‌గా నాలో కొంత సహజ ప్రతిభ ఉంటుంది. దానిని పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్ది సరైన దిశలో నడిపించడం కోచ్‌ల పని. ఆ విషయంలో నాకు అందరి నుంచి మేలు జరిగింది. 

కోచ్‌ పార్క్‌ టే సంగ్‌ గురించి..
ఆయన కొరియా కోచ్‌గా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఒకరి గురించి మరొకరికి బాగా తెలిసింది. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలం నుంచి పార్క్‌ నాకు వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. నా కోసం చాలా కష్టపడ్డారు. కోవిడ్‌ కష్ట కాలంలోనూ ఇంటికి పోకుండా నా శిక్షణపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. ఇక్కడ మ్యాచ్‌ల సమయంలో కళ్ల సైగలతోనే నాకు సందేశం అందించే వారంటే మా మధ్య ఎలాంటి సమన్వయం ఉందో అర్థం చేసుకోవచ్చు. నా ఈ గెలుపులో ఆయనది కీలక పాత్ర. పార్క్‌తో శిక్షణను కొనసాగిస్తా.

2024 పారిస్‌ ఒలింపిక్స్‌పై..
దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం ఇది సంబరాలు చేసుకునే సమయం. నా ఈ గెలుపును ఆస్వాదిస్తున్నా. అయితే పారిస్‌లో ఆడటం మాత్రం 100 శాతం ఖాయం. అంతే స్థాయిలో కష్టపడతా. అక్కడ స్వర్ణం సాధించడమే నా తదుపరి లక్ష్యం.

‘నాకు భారత్‌లో అభిమానులు పెరిగారు’
నేను సింధుకు కోచ్‌గా వచ్చే నాటికే ఆమె ఒలింపిక్‌ పతకం సాధించిన పెద్ద ప్లేయర్‌. అందుకే స్వర్ణం అందించాలనుకున్నా. అది దక్కకపోయినా కాంస్యంతో సంతోషం. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు ఇలా కాదు, అలా ఆడకు అంటూ జాగ్రత్తలు చెప్పేవాడిని. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు నిరంతరాయంగా భారత అభిమానుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి 13 రోజులు మాత్రమే మా ఇంట్లో ఉన్నాను. నా మూడేళ్ల కూతురు నా కోసం ఎదురు చూస్తోంది. వెళ్లి వచ్చాక కోచింగ్‌ కొనసాగిస్తా.
–పార్క్, సింధు కోచ్‌ 


 

తై జు కు సింధు ఓదార్పు!
ఒలింపిక్స్‌ అంటే పతకాలు సాధించడం మాత్రమే కాదు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం కూడా... తన ఓటమికి కారణమైన ప్రత్యర్థి అని ఆలోచించకుండా తై జు యింగ్‌ను ఓదార్చిన తీరే అందుకు నిదర్శనం. ఒలింపిక్‌ తొలి స్వర్ణాన్ని సాధించాలని ఆశించిన వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు...ఫైనల్లో చెన్‌ యు ఫె (చైనా) చేతిలో ఓడి రజతానికి పరిమితమైంది. ఆమె బాధను చూసిన సింధు దగ్గరకు వెళ్లి ఊరటనందించే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని తై జు స్వయంగా వెల్లడించింది. ‘ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత సింధు పరుగెత్తుకుంటూ నా వద్దకు వచ్చి గట్టిగా హత్తుకుంది. నావైపు నేరుగా చూస్తూ నీ బాధ ఎలాంటిదో నాకు అర్థమవుతోంది. నువ్వు చాలా బాగా ఆడావు కానీ ఈ రోజు నీది కాదు. ఇక్కడ ఓడితే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఓదార్చింది. దాంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. నన్ను ప్రోత్సహించిన ఆమెకు కృతజ్ఞతలు’ అని తైజు చెప్పింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top