
ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని భారత సెలెక్టర్లకు వెటరన్ పేసర్, బెంగాల్ ఆటగాడు మహ్మద్ షమీ (Mohammed Shami) దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ఇవాళ (అక్టోబర్ 15) ప్రారంభమైన రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) ఉత్తరాఖండ్‌పై 4 బంతుల్లో 3 వికెట్లు తీసి టీమిండియాకు అడేందుకు 100 శాతం అర్హుడినన్న సందేశం పంపాడు.
షమీ తీసిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్‌లు కాగా.. మరొకటి క్యాచ్ ఔట్. షమీతో పాటు ఇషాన్ పోరెల్ (15-3-40-3), సూరజ్ సింధు జైస్వాల్ (19-4-54-4) చెలరేగడంతో ఉత్తరాఖండ్ 72.5 ఓవర్లలో 213 పరుగులకే చాపచుట్టేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో భుపేన్ లాల్వాని (71) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో కనీసం ఒక్కరూ 30 పరుగుల మార్కును తాకలేకపోయారు.
ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా షమీని భారత సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఊహలకందని రీతిలో రాణించిన షమీ.. గాయం కారణంగా ఏడాదికాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.
ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడిన షమీ.. ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి, దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నా సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. అతను చివరిగా 2023 జూన్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకైనా ఎంపిక చేస్తారని షమీ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సెలెక్టర్లు ఈసారి కూడా పట్టించుకోలేదు. తాజాగా అతను ఆసీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు.
ఫిట్‌నెస్ సాకుగా చూపిస్తూ నన్ను పక్కకు పెట్టారు. ఫిట్‌నెస్ లేకపోతే రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానన్న అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు. సెలెక్లరు, కోచ్, కెప్టెన్ అనుకుంటేనే తాను జట్టులో ఉంటానని అన్నాడు. ఈ వాఖ్యలు చేసిన తర్వాత షమీ బంతితోనే సెలెక్టర్లను సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. మున్ముందైనా సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.
చదవండి: శతక్కొట్టిన ఇషాన్ కిషన్