Mithali Raj Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌

Mithali Raj Announces Retirement From All Formats Of Cricket - Sakshi

Mithali Raj Retirement: భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ రిటైర్మెంట్‌ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ సీనియర్‌ బ్యాటర్‌ సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు. 

ఈ మేరకు ‘‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాలు నుంచి గొప్ప అనుభవం గడించాను. ప్రతి ప్రయాణం లాగే ఇది కూడా ఏదో ఒకరోజు ముగించాల్సిందే కదా!

ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టును గెలిపించాలని భావించేదానిని. ఇప్పుడిక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలి. భారత మహిళా క్రికెట్‌ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి’’ అంటూ మిథాలీ భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశారు.

ఈ సందర్భంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతానంటూ భవిష్యత్‌ ప్రణాళికల గురించి హింట్‌ ఇచ్చారు. భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. తనకు అండగా నిలిచి ఆదరాభిమానాలు చూపిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కాగా 2019లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ తాజాగా వన్డే, టెస్టులకు కూడా గుడ్‌ బై చెప్పారు. 1999లో అరంగ్రేటం చేసిన మిథాలీ రాజ్‌.. భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగారు. 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించారు. భారత్‌ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడారు. 

చదవండి: Ind Vs SA: పాం‍డ్యా, సంజూపై ద్రవిడ్‌ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top