నీరజ్‌, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..!

Mitali And Neeraj Among 11 Recommended For Khel Ratna And Dhawan Among 35 Named For Arjuna Award - Sakshi

నీరజ్‌ చోప్రాకు ఖేల్‌రత్న పురస్కారం

మిథాలీ రాజ్, శ్రీజేశ్, సునీల్‌ ఛెత్రిలకు కూడా

‘అర్జున’కు 35 పేర్లు సిఫారసు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 

ఆమోదం లాంఛనమే 

Mithali And Neeraj Among 11 Recommended For Khel Ratna Award: ఒకవైపు ఒలింపిక్‌ పతక విజేతలు... మరోవైపు ముగ్గురు జాతీయ జట్ల కెప్టెన్లు... దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి తగిన అర్హత ఉన్న ఆటగాళ్లను ప్రభుత్వం సముచితంగా గౌరవించనుంది. ‘ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఒకేసారి 11 మంది పేర్లను ఎంపిక కమిటీ ప్రతిపాదించగా... వీటికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోద ముద్ర వేయడం లాంఛనం కానుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాకు ఊహించిన విధంగానే ‘ఖేల్‌రత్న’ చెంత చేరగా... సుదీర్ఘ కెరీర్‌లో జాతీయ జట్టుకు సేవలు అందించిన భారత ఫుట్‌బాల్, హాకీ, మహిళల క్రికెట్‌ జట్ల సారథులు సునీల్‌ ఛెత్రి, శ్రీజేశ్, మిథాలీ రాజ్‌లకు ఈ అవార్డు మరింత శోభ తెచ్చింది. తమ ప్రతిభతో దేశానికి పేరు తెచి్చన మరో 35 మంది పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కూడా సిఫారసు చేశారు. 

నీరజ్‌ చోప్రా (అథ్లెటిక్స్‌)
ప్రస్తుతం భారత్‌లో పరిచయం అవసరం లేని పేరు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనడమే గొప్ప విజయంగా ఇన్నాళ్లూ భావిస్తూ రాగా, ఏకంగా స్వర్ణ పతకంతో మెరిసి నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఐదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మొదలైన ఈ జావెలిన్‌ త్రోయర్‌ విజయ ప్రస్థానం టోక్యోలో ఒలింపిక్స్‌ గోల్డ్‌ వరకు చేరింది. 2018లో ‘అర్జున’ అందుకున్న 24 ఏళ్ల నీరజ్‌ ఒలింపిక్‌ ప్రదర్శనకు ‘ఖేల్‌రత్న’ అవార్డు ఒక లాంఛనంలాంటిదే. 

సునీల్‌ ఛెత్రి
ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ఏమాత్రం గుర్తింపు లేకుండా ఎక్కడో మూలన మిణుకుమిణుకుమంటూ కనిపించే భారత జట్టుకు సుదీర్ఘ కాలంగా సునీల్‌ ఛెత్రి ఊపిరి పోస్తున్నాడు. 16 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఛెత్రి 120 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 80 గోల్స్‌ సాధించిన అతను ఇటీవలే దిగ్గజ ఫుట్‌బాలర్‌ లయోనల్‌ మెస్సీతో సమంగా నిలిచాడు. భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక గోల్స్‌ చేసిన ఛెత్రి... ఫుట్‌బాల్‌లో తొలి ‘ఖేల్‌రత్న’ కావడం విశేషం. 2011లో అతను ‘అర్జున అవార్డు’ గెలుచుకున్నాడు. 

రవికుమార్‌ దహియా (రెజ్లింగ్‌)
టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన రజత పతకానికి దక్కిన గుర్తింపు ఇది. హరియాణాలోని సోనెపట్‌లో ‘మ్యాట్‌’ల నుంచి ఒలింపిక్‌ విజేతగా నిలిచే వరకు రవి తన పట్టుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒలింపిక్‌ విజయానికి ముందు 2019లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం అతని అత్యుత్తమ ప్రదర్శన కాగా... రవికి ప్రభుత్వం తరఫున ఇదే తొలి పురస్కారం. ఒలింపిక్స్‌కు ముందే అతని పేరును ‘అర్జున’ అవార్డు కోసం ఫెడరేషన్‌ ప్రతిపాదించినా... టోక్యో విజయంతో అతని అవార్డు స్థాయి సహజంగానే పెరిగింది. 

లవ్లీనా (బాక్సింగ్‌)
అసోంకు చెందిన 24 ఏళ్ల లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన లవ్లీనా వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు సాధించి ఒలింపిక్స్‌ దిశగా దూసుకెళ్లింది. గత ఏడాదే ఆమెకు ‘అర్జున’ పురస్కారం దక్కింది. తనకు లభించనున్న ‘ఖేల్‌రత్న’ అవార్డును తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు లవ్లీనా తెలిపింది.

మిథాలీ రాజ్‌ (క్రికెట్‌) 
22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌... 10 వేలకు పైగా పరుగులు... ఒకటా, రెండా...అంకెలకు అందని ఎన్నో ఘనతలు భారత స్టార్‌ మిథాలీ రాజ్‌ అందుకుంది. భారత మహిళల క్రికెట్‌కు పర్యాయపదంగా మారి రెండు తరాల వారధిగా నిలిచిన మిథాలీ అమ్మాయిలు క్రికెట్‌లోకి అడుగు పెట్టేందుకు అసలైన స్ఫూర్తిగా నిలిచింది. 39 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస్, ఆటతో కొనసాగడమే కాకుండా భారత టెస్టు, వన్డే జట్టు కెపె్టన్‌గా కూడా జట్టును నడిపిస్తోంది.

1999లో తొలి మ్యాచ్‌ ఆడిన ఈ హైదరాబాదీ కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు, రివార్డులు చేరాయి. ఇప్పుడు ‘ఖేల్‌రత్న’ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలవడం సహజ పరిణామం. 2003లోనే ‘అర్జున’ అందుకున్న మిథాలీ సాధించిన ఘనతలకు ‘ఖేల్‌రత్న’ నిజానికి బాగా ఆలస్యంగా వచ్చినట్లే భావించాలి! భారత్‌ తరఫున మిథాలీ 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది.

పీఆర్‌ శ్రీజేశ్‌ (హాకీ)
భారత హాకీకి బలమైన ‘గోడ’లా నిలుస్తూ అనేక అంతర్జాతీయ విజయాల్లో శ్రీజేశ్‌ కీలకపాత్ర పోషించాడు. గోల్‌కీపర్‌గా అనేక ఘనతలు సాధించిన అతను జట్టు కెపె్టన్‌గా కూడా వ్యవహరించాడు. కేరళకు చెందిన శ్రీజేశ్‌ 244 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో అతను భాగస్వామి. అంతకుముందే కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ, చాంపియన్స్‌ ట్రోఫీలలో చిరస్మరణీయ విజయాలు సాధించిన జట్లలో శ్రీజేశ్‌ కూడా ఉన్నాడు. 2015లో అతనికి ‘అర్జున’ పురస్కారం లభించింది.

ఐదుగురు పారాలింపియన్లకు ‘ఖేల్‌రత్న’ 

  • ప్రమోద్‌ భగత్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
  • సుమీత్‌ అంటిల్‌ (జావెలిన్‌ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
  • అవని లేఖరా (షూటింగ్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం 
  • కృష్ణ నాగర్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 
  • మనీశ్‌ నర్వాల్‌ (బ్యాడ్మింటన్‌): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం 

చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అనంతరం పాక్‌ ఫ్యాన్స్‌ ఓవరాక్షన్‌.. ఏం చేశారో చూడండి..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top