ఆ క్యాచ్‌పై తీవ్ర చర్చ.. మీరు కూడా ఓ లుక్కేయండి

Labuschagnes Running Back Catch Sparks Twitter Debate - Sakshi

న్యూసౌత్‌వేల్స్‌: క్రికెట్‌లో కొన్ని అసాధారణ క్యాచ్‌లు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి. సింగిల్‌ హ్యాండెడ్‌ క్యాచ్‌, బౌండరీ లైన్‌పై క్యాచ్‌లు, డైవ్‌ కొట్టి పట్టిన క్యాచ్‌లు, రన్నింగ్‌ బ్యాక్‌ క్యాచ్‌లు ఎక్కువగా అభిమానుల్ని అలరిస్తూ ఉంటాయి. కాగా, ఇప్పుడు ఒక రన్నింగ్‌ బ్యాక్‌ క్యాచ్‌ సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. అది అసాధారణ క్యాచ్‌ అయినప్పటికీ కూడా దాన్ని ఎలా క్యాచ్‌ ఇస్తారంటూ ట్వీటర్‌లో ప్రశ్నల వర్షం కురుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. షెఫల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్‌-క్వీన్‌లాండ్స్‌ మధ్య నిన్న మ్యాచ్‌ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో క్వీన్‌లాండ్స్‌ ఆటగాడు లబూషేన్‌ ఒక మంచి క్యాచ్‌ను అందుకున్నాడు. మిచెల్‌ స్వీప్సెన్‌ బౌలింగ్‌లో న్యూసౌత్‌వేల్స్‌ ఆటగాడు బాక్స్‌టర్‌ హోల్ట్‌ ఒక షాట్‌ ఆడగా అది కాస్తా అవుట్‌ సైడ్‌ ఎడ్జ్‌ పట్టుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లబూషేన్‌ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ అందుకున్నాడు. బాల్‌ను వెంటాడీ మరీ క్యాచ్‌ తీసుకున్నాడు. 

అయితే క్యాచ్‌ను అందుకున్న మరుక్షణమే అంటే ఇంకా పూర్తి నియంత్రణ రాకుండా ఆ క్యాచ్‌ను కిందికి విసిరేశాడు. దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆ క్యాచ్‌ను పట్టిన వెంటనే ఇలా కావాలనే కిందికి విసిరేయడాన్ని కామెంటేటర్లు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అది క్యాచ్‌ తీసుకున్నాడా.. లేక డ్రాప్‌ చేశాడా అనే అనుమానం లేవనెత్తారు. ఇదే విషయాన్ని ట్వీటర్‌లో అభిమానులు కూడా వేలెత్తిచూపుతున్నారు.

ఇది లీగల్‌ క్యాచ్‌ ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఇది కచ్చితంగా క్యాచ్‌ అంటూ కౌంటర్‌ ఎటాక్‌ ఇస్తున్నారు. ఇక్కడ కంట్రోల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, క్యాచ్‌ పట్టిన తర్వాత కిందికి విసిరేయవచ్చని బదులిస్తున్నారు.  ఇక్కడ గత మెగా ఈవెంట్లలో జరిగిన సందర్భాలను కూడా ప్రస్తావిస్తున్నారు.  1999 వరల్డ్‌కప్‌లో భాగంగా సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్‌ ఇలానే పట్టి వదిలేశాడని అంటున్నారు. అప్పుడు అది క్యాచ్‌ ఔట్‌ ఇవ్వలేదని నిలదీస్తున్నారు. దానికి-దీనికి కూడా ఒకే తరహా పోలికలున్నాయని వాదనకు దిగుతున్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top