NZ Vs SL: చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్‌లో కొత్త శకం

Kim Cotton Becomes1st-Woman On-field Umpire Mens International Match  - Sakshi

అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో సరికొత్త శకం మొదలైంది. తొలిసారి ఒక మెన్స్‌ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఒక మహిళ ఫీల్డ్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌కు చెందిన మహిళా అంపైర్‌ కిమ్‌ కాటన్‌ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్‌, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్‌ కాటన్‌.. మరో అంపైర్‌ వేన్‌ నైట్స్‌తో కలిసి ఫీల్డ్‌ అంపైరింగ్‌ చేసింది.

అయితే కిమ్‌ కాటన్‌ గతంలో న్యూజిలాండ్‌, భారత్‌ల మధ్య హామిల్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్‌ పాత్ర పోషించింది. తాజాగా మాత్రం పురుషుల క్రికెట్‌లో తొలిసారి ఫీల్డ్‌ అంపైరింగ్‌ చేసిన కిమ్‌ కాటన్‌ తన పేరును క్రికెట్‌ పుస్తకాల్లో లిఖించుకుంది. కాగా మహిళా అంపైర్‌గా కిమ్‌ కాటన్‌ పేరిట చాలా రికార్డులున్నాయి.

2020లో మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్‌ టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళా అంపైర్‌గా కిమ్‌ కాటన్‌ నిలిచింది. అంతేకాదు మూడు మహిళల టి20 వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా పనిచేసింది. ఇక 2020, 2022, 2023 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో ఫీల్డ్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించి ఎవరికి దక్కని రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక ఓవరాల్‌గా 2018 నుంచి కిమ్‌ కాటన్‌ 54 టి20 మ్యాచ్‌లతో పాటు 24 వన్డేల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించింది.

ఇక రెండో టి20 విషయానికి వస్తే న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య  జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్‌ 8న క్వీన్స్‌ టౌన్‌లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే

మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన కివీస్‌.. ఫాస్ట్‌ బౌలర్‌ ఆడమ్‌ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. టిమ్‌ సీఫర్ట్‌ (43 బంతుల్లో 79 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది.

చదవండి: NZ VS SL 2nd T20: సీఫర్ట్‌ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top