IPL 2022 SRH Vs KKR: Sunrisers Hyderabad Beats Kolkata Knight Riders By 7 Wickets, Check Full Score Details - Sakshi
Sakshi News home page

IPL 2022 SRH Vs KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయం..

Apr 16 2022 4:47 AM | Updated on Apr 16 2022 11:39 AM

IPL 2022: Sunrisers Hyderabad beats Kolkata Knight Riders by 7 wickets  - Sakshi

ముంబై: ఐపీఎల్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జోరు కొనసాగుతోంది. సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కోలుకున్న జట్టు ఇప్పుడు విజయాల ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

నితీశ్‌ రాణా (36 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్‌ (25 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, నటరాజన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ త్రిపాఠి (37 బంతుల్లో 71; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా, మార్క్‌రమ్‌ (36 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 54 బంతుల్లో 94 పరుగులు జోడించి హైదరాబాద్‌ విజయానికి బాటలు వేశారు.  

రాణా అర్ధసెంచరీ...
ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టు తరఫున బరిలోకి దిగిన ఆరోన్‌ ఫించ్‌ (7) ఎలాంటి ముద్ర వేయకుండానే నిష్క్రమించగా, వెంకటేశ్‌ అయ్యర్‌ (6) వైఫల్యాల వరుస ఇక్కడా కొనసాగింది. సునీల్‌ నరైన్‌ (6)ను ముందుగా పంపించడం కూడా ఫలితాన్ని అందించలేదు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 38/3 వద్ద నిలిచింది. ఈ స్థితిలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (25 బంతుల్లో 28; 3 ఫోర్లు) బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే అతని బ్యాటింగ్‌లోనూ ఎలాంటి మెరుపులు కనిపించలేదు.

చివరకు ఉమ్రాన్‌ అద్భుత యార్కర్‌తో శ్రేయస్‌ ఆట ముగిసింది. అనంతరం రాణా ధాటిగా ఆడటంతో స్కోరు వేగం పెరిగింది. నటరాజన్‌ ఓవర్లో 4, 6 కొట్టిన అతను ఉమ్రాన్‌ ఓవర్లో మరో సిక్స్‌ కొట్టి 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షెల్డన్‌ జాక్సన్‌ (7) విఫలం కాగా, చివర్లో రసెల్‌ దూకుడు నైట్‌రైడర్స్‌కు మెరుగైన స్కోరు అందించింది. భువనేశ్వర్‌ వేసిన 17వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన రసెల్‌... సుచిత్‌ వేసిన 20వ ఓవర్లో చివరి మూడు బంతుల్లో 6, 6, 4 బాదడం విశేషం.  

భారీ భాగస్వామ్యం...
ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (3), విలియమ్సన్‌ (17) తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో ఛేదనలో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే త్రిపాఠి బ్యాటింగ్‌తో ఒక్కసారిగా మ్యాచ్‌ మారిపోయింది. తన పాత జట్టుపై ప్రతాపం చూపిస్తూ త్రిపాఠి ఏ బౌలర్‌నూ వదలకుండా వరుస బౌండరీలతో దూసుకుపోయాడు. అమాన్‌ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టిన అతను వరుణ్‌ చక్రవర్తి ఓవర్లో వరుసగా 4, 6, 6 తో చెలరేగిపోయాడు.

21 బంతుల్లోనే త్రిపాఠి అర్ధ సెంచరీ పూర్తి కావడం విశేషం. మరోవైపు మార్క్‌రమ్‌ కూడా తగ్గలేదు. వరుణ్‌ తర్వాతి ఓవర్లో 6, 4 బాదిన అతను, ఉమేశ్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. రసెల్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టిన అనంతరం తర్వాతి బంతికే త్రిపాఠి వెనుదిరగడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు వరుణ్‌ ఓవర్లో మళ్లీ వరుసగా 4, 6 కొట్టిన మార్క్‌రమ్‌ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. చివర్లో మరింత చెలరేగుతూ కమిన్స్‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన మార్క్‌రమ్‌ మరో 13 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: వెంకటేశ్‌ (బి) నటరాజన్‌ 6; ఫించ్‌ (సి) పూరన్‌ (బి) జాన్సెన్‌ 7; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) ఉమ్రాన్‌ 28; నరైన్‌ (సి) శశాంక్‌ (బి) నటరాజన్‌ 6; నితీశ్‌ రాణా (సి) పూరన్‌ (బి) నటరాజన్‌ 54; జాక్సన్‌ (సి) నటరాజన్‌ (బి) ఉమ్రాన్‌ 7; రసెల్‌ (నాటౌట్‌) 49; కమిన్స్‌ (సి) జాన్సెన్‌ (బి) భువనేశ్వర్‌ 3; అమాన్‌ ఖాన్‌ (బి) సుచిత్‌ 5; ఉమేశ్‌  యాదవ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175.
వికెట్ల పతనం: 1–11, 2–25, 3–31, 4–70, 5–103, 6–142, 7–153, 8–158.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–37–1, జాన్సెన్‌ 4–0–26–1, నటరాజన్‌ 4–0–37–3, ఉమ్రాన్‌ 4–0–27–2, శశాంక్‌ 1–0–10–0, సుచిత్‌ 3–0–32–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) కమిన్స్‌ 3, విలియమ్సన్‌ (బి) రసెల్‌ 17; త్రిపాఠి (సి) వెంకటేశ్‌ (బి) రసెల్‌ 71; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 68; పూరన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 176.
వికెట్ల పతనం: 1–3, 2–39, 3–133.
బౌలింగ్‌: ఉమేశ్‌ 4–0–31–0, కమిన్స్‌ 3.5–0–40–1, రసెల్‌ 2–0–20–2, అమాన్‌ ఖాన్‌ 1–0–13–0, వరుణ్‌ 3–0–45–0, నరైన్‌ 4–0–23–0.  

ఐపీఎల్‌లో నేడు
ముంబై ఇండియన్స్‌ X లక్నో సూపర్‌ జెయింట్స్‌
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి

ఢిల్లీ క్యాపిటల్స్‌ X రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement