అభిమాని ప్రశ్నకు సీఎస్‌కే స్పిన్నర్‌ తాహిర్‌ సమాధానం

IPL 2021: Imran Tahir Responds To A Fan Who Asked About His Chance To Play For CSK - Sakshi

ముంబై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే జట్టు.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సొంతం చేసుకుని నాలుగో టైటిల్‌ దిశగా అడుగులేస్తుంది. అయితే, చెన్నై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌కు స్థానం లభించకపోవడంపై అతని అభిమాని ఒకరు ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు. దీనికి తాహిర్‌ బదులిస్తూ చేసిన రిటర్న్‌ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో తాహిర్‌ సదరు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రస్తుతం చెన్నై తమ అత్యుత్తమ జట్టుతో బరిలో ఉందని, వారు మైదానంలో ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారని, చెన్నై జట్టు సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నానని, జట్టుకు తన సేవలు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధంగా ఉన్నానని బదులిచ్చాడు. 

కాగా, 2018 ఐపీఎల్‌ నుంచి చెన్నై జట్టు సభ్యుడిగా కొనసాగుతున్న తాహిర్‌.. తన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ను గతేడాది పంజాబ్‌ కింగ్స్‌తో ఆడాడు. గడిచిన మూడు సీజన్లలో తాహిర్‌ లేకుండా చెన్నై జట్టు బరిలోకి దిగడం చాలా అరుదుగా చూశాం. తాహిర్‌ తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 58 మ్యాచ్‌ల్లో 16.15 స్ట్రయిక్‌ రేట్‌తో 80 వికెట్లు పడగొట్టాడు.  చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 26 మ్యాచ్‌లు ఆడిన ఈ సఫారీ లెగ్‌ స్పిన్నర్‌.. 33 వికెట్లు సాధించాడు. తాహిర్‌.. చెన్నై తరఫున ఆడిన తొలి సీజన్‌లోనే(2018) సీఎస్‌కే టైటిల్‌ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైన ధోని సేన... ఆతరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో(పంజాబ్‌, రాజస్థాన్‌) విజయం సాధించి జోరుమీదుంది. బుధవారం(ఏప్రిల్‌ 21న) కేకేఆర్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో కూడా విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది.  
చదవండి: వాషింగ్ట‌న్‌, ప‌డిక్క‌ల్‌లకు బంపర్‌ ఆఫర్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top