Brian Lara: ఆర్సీబీ ప్రదర్శన ఘోరంగా ఉంది.. అయితే.. ఆ విషయం మాత్రం..

IPL 2021: Brian Lara Over RCB Lost To KKR And Virat Kohli Dismissal - Sakshi

Brian Lara Comments On RCB: ఐపీఎల్‌-2021 సీజన్‌ ముగిసిన తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతానన్న విరాట్‌ కోహ్లి ప్రకటన జట్టు జయాపజయాలను ప్రభావితం చేయకపోవచ్చని విండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా అభిప్రాయపడ్డాడు. ఆటకు ఈ విషయానికి పెద్దగా సంబంధం ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. అయితే, అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను ఆర్సీబీ ఈ ఏడాది సాధించాలని భావిస్తోందని, అలాగే కోహ్లి కూడా ఘనంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించడం సహజం అన్నాడు.

ఇక కేకేఆర్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో మాదిరే మరోసారి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడన్న లారా.. కుడిచేతి వాటం గల చాలా మంది బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొనే ప్రధాన సమస్యనే తానూ ఎదుర్కొన్నాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 రెండో అంచెలోని తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ కేకేఆర్‌ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌గా వచ్చిన సారథి కోహ్లి(5), హిట్టర్స్‌ మాక్స్‌వెల్(10)‌, డివిల్లియర్స్‌(0) విఫలం కావడంతో 92 పరుగులకే చాప చుట్టేసిన పరిస్థితి.

దీంతో ఆర్సీబీ ఆట తీరుపై మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. వచ్చే సీజన్‌లో ఆర్సీబీ పగ్గాలు వదిలేస్తానన్న కోహ్లి ప్రకటన ఆటగాళ్లపై ఒత్తిడి పెంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రియన్‌ లారా క్రికెట్‌.కామ్‌తో మాట్లాడుతూ... ‘‘ఆర్సీబీ ప్రదర్శన ఘోరంగా ఉంది. తొలి దశలో వెనుకబడిన కేకేఆర్‌ పుంజుకోగా.. ఆర్సీబీ మాత్రం చేతులెత్తేసింది. అయినా కోహ్లి ప్రకటనకు ఆటకు సంబంధం ఉందని అనుకోను. ఒక్కసారి బెంగళూరు ఆటగాళ్లు విజృంభిస్తే వారిని ఆపటం ఎవరితరం కాదు’’ అని చెప్పుకొచ్చాడు. 

అప్పుడు కూడా అలాగే..
‘‘ప్రపంచ కప్‌-2019 సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లి ఇలాగే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత షాట్‌ ఆడినపుడు కోహ్లి హెడ్‌ పొజిషన్‌ గమనిస్తే... మనకు విషయం అర్థమవుతుంది. తదుపరి డెలివరీలోనూ బంతి తలకు చేరువగా వచ్చింది. లైన్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది. కానీ కోహ్లి హెడ్‌ పొజిషన్‌ మాత్రం మారలేదు. కుడిచేతి వాటం గల చాలా మంది బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొనే సమస్యే తనకూ ఎదురైంది. కాస్త బాలెన్స్‌ చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేది’’ అని కోహ్లి అవుట్‌ అయిన తీరుపై లారా స్పందించాడు. కాగా కేకేఆర్‌ బౌలర్‌ ప్రసిధ్‌ క్రిష్ణ ఇన్‌- స్వింగర్‌కు కోహ్లి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top