దస్‌ కా దమ్‌ | India wins 10 medals at Asian Rowing Championships | Sakshi
Sakshi News home page

దస్‌ కా దమ్‌

Oct 20 2025 3:03 AM | Updated on Oct 20 2025 3:03 AM

India wins 10 medals at Asian Rowing Championships

ఆసియా రోయింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 10 పతకాలు

న్యూఢిల్లీ: ఆసియా రోయింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రోయర్లు సత్తాచాటారు. వియత్నాం వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో ఒలింపియన్‌ బాల్‌రాజ్‌ పన్వర్‌ నేతృత్వంలోని భారత బృందం 10 పతకాల (3 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు)తో మెరిసింది. పురుషుల సింగిల్స్‌ స్కల్‌ (ఎమ్‌1ఎక్స్‌) విభాగంలో బాల్‌రాజ్‌ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. 

లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్‌ (ఎల్‌ఎమ్‌2ఎక్స్‌) ఈవెంట్‌లో లక్ష్య, అజయ్‌ త్యాగి స్వర్ణ పతకం గెలుచుకోగా... పురుషుల క్వాడ్రపుల్‌ స్కల్‌ (ఎమ్‌4ఎక్స్‌) ఈవెంట్‌లో కుల్విందర్‌ సింగ్, నవ్‌దీప్‌ సింగ్, సత్‌నామ్‌ సింగ్, జకర్‌ ఖాన్‌తో కూడిన భారత బృందం బంగారు పతకం నెగ్గింది. ఇక మహిళల లైట్‌ వెయిట్‌ డబుల్స్‌ (ఎల్‌డబ్ల్యూ2) విభాగంలో గుర్బానీకౌర్‌–దిల్‌జ్యోత్‌ కౌర్‌ జంట రజత పతకం గెలుచుకుంది. తద్వారా ఆసియా చాంపియన్‌షిప్‌లో 15 ఏళ్ల భారత పతక నిరీక్షణకు ఈ జోడీ తెరదించింది. 

పురుషుల టీమ్‌ (ఎమ్‌8) విభాగంలో నితిన్‌ డియోల్, పర్విందర్‌ సింగ్, లఖ్‌వీర్‌ సింగ్, రవి, గుర్‌ప్రతాప్‌ సింగ్, భీమ్‌ సింగ్, జస్‌విందర్‌ సింగ్, కుల్‌బీర్, కిరణ్‌ సింగ్‌తో కూడిన భారత బృందం రజత పతకం ఖాతాలో వేసుకుంది. పురుషుల డబుల్‌ స్కల్‌ (ఎమ్‌2ఎక్స్‌)లో జస్‌పిందర్‌ సింగ్‌–సల్మాన్‌ ఖాన్‌ జంట రజతం  గెలుచుకోగా... పురుషుల లైట్‌ వెయిట్‌ క్వాడ్రపుల్‌ స్కల్‌ (ఎల్‌ఎమ్‌4ఎక్స్‌)లో రోహిత్, ఉజ్వల్‌ కుమార్‌ సింగ్, లక్ష్య, అజయ్‌ త్యాగీతో కూడిన భారత బృందం రజతం చేజిక్కించుకుంది. 

లైట్‌వెయిట్‌ పురుషుల ఫోర్‌ (ఎల్‌ఎమ్‌4) ఈవెంట్‌లో సానీ కుమార్, ఇక్బాల్‌ సింగ్, బాబులాల్‌ యాదవ్, యోగేశ్‌ కుమార్‌తో కూడిన భారత జట్టు వెండి వెలుగులు విరజిమ్మింది. పురుషుల లైట్‌ వెయిట్‌ (ఎల్‌ఎమ్‌2)లో నితిన్‌ డియోల, పర్విందర్‌ సింగ్‌ కాంస్యం కైవసం చేసుకోగా... మహిళల టీమ్‌ (డబ్ల్యూ8) విభాగంలో గుర్బానీ కౌర్, దిల్‌జ్యోత్‌ కౌర్, సుమన్‌ దేవి, అలెనా ఆంటో, కిరణ్, పూనమ్, హౌబిజామ్‌ దేవితో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి మొత్తం 37 మంది  పోటీపడ్డారు. ఇందులో 25 మంది పురుష రోయర్లు కాగా, 12 మంది మహిళలున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement