T20 WC 2026: చరిత్ర సృష్టించిన భారత్‌.. వరల్డ్‌ రికార్డు | India create history with highest total in T20 WC final Vs NZ | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చరిత్ర సృష్టించిన భారత్‌.. ప్రపంచ రికార్డు

Mar 8 2026 9:08 PM | Updated on Mar 8 2026 9:57 PM

India create history with highest total in T20 WC final Vs NZ

టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను చితక్కొడుతూ భారత టాపార్డర్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ ఓడిన టీమిండియా.. కివీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

అభిషేక్‌. సంజూ ధనాధన్‌
గత మ్యాచ్‌లలో విఫలమై విమర్శలు మూటగట్టుకున్న ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ.. టైటిల్‌ పోరులో బ్యాట్‌ ఝులిపించాడు. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 52 పరుగులు సాధించాడు.

ఇక మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తూ మరోసారి విజృంభించాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 89 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెమీస్‌ మాదిరే సెంచరీకి మరోసారి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

ఇషాన్‌ సైతం
వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌.. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 54 పరుగులు చేశాడు.  మిగిలిన వారిలో సూర్యకుమార్‌ యాదవ్‌ డకౌట్‌ కాగా.. హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 18) నిరాశపరిచాడు. తిలక్‌ వర్మ 6 బంతుల్లో 8 పరుగులతో అజేయంగా నిలవగా.. శివం దూబే 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమ్స్‌ నీషమ్‌ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. మ్యాట్‌ హెన్రీ, రచిన్‌ రవీంద్ర తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో టైటిల్‌ పోరులో 255/5 స్కోరు నమోదు చేసిన టీమిండియా.. గత ఎడిషన్‌లో తాను సృష్టించిన రికార్డును.. తాజాగా బద్దలు కొట్టింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో సౌతాఫ్రికాతో ఫైనల్లో టీమిండియా 176/7 నమోదు చేసింది.

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్లు
👉టీమిండియా- 2026లో న్యూజిలాండ్‌పై 255/5
👉టీమిండియా- 2024లో సౌతాఫ్రికాపై 176/7
👉ఆస్ట్రేలియా- 2021లో న్యూజిలాండ్‌పై 173/2
👉న్యూజిలాండ్‌- 2021లో ఆస్ట్రేలియాపై 172/4
👉వెస్టిండీస్‌- 2016లో ఇంగ్లండ్‌పై 161/6
👉టీమిండియా- 2007లో పాకిస్తాన్‌ 157/5.

చదవండి: టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement