IND Vs SA 3rd Test: సెంచరీ పూర్తి చేసిన కోహ్లి

IND Vs SA 3rd Test Day 2: Virat Kohli Celebrates 100 Test Catches - Sakshi

కేప్‌టౌన్‌: టీమిండియా టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లి టెస్ట్‌ల్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో సెంచరీ మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అదేంటీ.. కోహ్లి కొత్తగా సెంచరీ సాధించడమేంటీ అని అనుకుంటున్నారా..? అయితే, కోహ్లి ఈ సారి సెంచరీ మార్కును అందకుంది బ్యాటింగ్‌లో కాదు. అతను సెంచరీ పూర్తి చేసింది ఫీల్డింగ్‌లో. 

దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో షమీ బౌలింగ్‌లో టెంబా బవుమా క్యాచ్‌ అందుకోవడం ద్వారా కోహ్లి టెస్ట్‌ల్లో 100 క్యాచ్‌లు పూర్తి చేశాడు. తద్వారా రాహుల్‌ ద్రవిడ్‌(164 టెస్ట్‌ల్లో 210 క్యాచ్‌లు), వీవీఎస్‌ లక్ష్మణ్‌(134 మ్యాచ్‌ల్లో 135), సచిన్‌ టెండూల్కర్‌(200 మ్యాచ్‌ల్లో 115), సునీల్‌ గవాస్కర్‌(125 మ్యాచ్‌ల్లో 108), అజహారుద్దీన్‌(99 టెస్ట్‌ల్లో 105)ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా(వికెట్‌కీపర్‌ కాకుండా) నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి కెరీర్‌లో 99వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడు.  

ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి సెకెండ్‌ స్లిప్‌లో అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో బవుమా(28) పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పీటర్సన్‌(61), వెర్రిన్‌ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా, షమీ ఓ వికెట్‌ సాధించాడు. అంతకుముందు తొలి రోజు భారత్‌ 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs SA ODI Series: వన్డే సిరీస్‌కు జయంత్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ ఎంపిక

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top