World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్‌.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!

ICC Women World Cup 2022: Harmanpreet Kaur Heroics Go Vain Videos Viral - Sakshi

ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్‌ టోర్నీ-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత 48 పరుగులు చేసి మిథాలీ సేన భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆమె.. ‘బౌలర్‌’గానూ అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి బౌలింగ్‌ వేసిన హర్మన్‌.. రెండు వికెట్లు తీసింది.

అంతేకాదు.. దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతున్న వేళ ఓపెనర్‌ లిజెలీ లీని రనౌట్‌ రూపంలో వెనక్కి పంపి భారత్‌కు శుభారంభం అందించింది. అదే విధంగా మరో రెండు రనౌట్లలోనూ భాగమైంది. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ఇలా శాయశక్తులా కృషి చేసింది. కానీ సానుకూల ఫలితం రాలేదు.

భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ.. దక్షిణాఫ్రికా ఆఖరి బంతికి విజయం సాధించి మిథాలీ సేన సెమీస్‌ చేరకుండా అడ్డుకుంది. దీంతో హర్మన్‌ ‘హీరోచిత’ పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో హర్మన్‌ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ భావోద్వేగానికి గురవుతున్నారు.

భారత్‌ కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్‌ తీసినపుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగిన దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘నీ ఆట తీరు పట్ల మాకెంతో గర్వంగా ఉంది. ఆఖరి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగావు. అంతా నువ్వే చేశావు. కానీ దురదృష్టం వెంటాడింది. ఏదేమైనా ఆట పట్ల నీకున్న అంకితభావం అమోఘం. మరేం పర్లేదు హర్మన్‌.. ఓడినా మీరు మా మనసులు గెలిచారు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ​కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలై భారత్‌ వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top