ICC Rankings: టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్‌ ర్యాంక్‌లు

ICC Rankings: Usman Khawaja Leaps Career Best In Test Rankings - Sakshi

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు హవా కొనసాగింది. టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్‌ ఆటగాళ్లు అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్‌లో లబూషేన్‌ (892), స్టీవ్‌ స్మిత్‌ (845) తొలి రెండు స్థానాలను పదిలం చేసుకోగా, పాక్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (757) టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌ 10లోకి దూసుకొచ్చాడు. ఖ్వాజా ఏకంగా 6 స్థానాలు ఎగబాకి 7వ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ (754), విరాట్‌ కోహ్లి (742)లు తలో ర్యాంక్‌ కోల్పోయి 8, 10 స్థానాలకు పడిపోయారు. 

తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్ ఓ ర్యాంకును మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్‌ 10లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, సఫారీ స్పీడ్‌స్టర్‌ రబాడ, భారత పేసు గుర్రం బుమ్రా, పాక్‌ నయా సంచలనం షాహీన్‌ అఫ్రిది వరుసగా 1 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ కేటగిరీలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (385), రవిచంద్రన్ అశ్విన్ (341)తొలి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. 

మరోవైపు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో (బ్యాటింగ్‌ విభాగంలో) పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కివీస్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ తొలి మూడు స్థానాలను నిలబెట్టుకోగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ స్థానం ఎగబాకి ఫోర్త్‌ ప్లేస్‌కు చేరాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పాక్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌లు చెరో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 6, 10 స్థానాలకు ఎగబాకారు. 

బౌలింగ్‌లో ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడం జంపా ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి, బంగ్లా వెటరన్‌ స్పిన్నర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ బౌల్ట్‌, ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌, ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.   
చదవండి: IPL 2022: జోరుమీదున్న కేకేఆర్‌ను ఆర్సీబీ నిలువరించేనా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top