AUS vs PAK: గంటసేపు ఓపిక పట్టలేకపోయారు.. ఇంకెందుకయ్యా!

Fans Troll Pakistan Team After Losing Match To Australia Last 1 Hour - Sakshi

పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 115 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ 235 పరుగులకే ఆలౌటైంది.   తద్వారా మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 24 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై అడుగుపెట్టి సిరీస్‌ విజయం సాధించిన ఆసీస్‌పై ప్రశంసలు వస్తున్న వేళ.. పాకిస్తాన్‌ జట్టుపై సొంత అభిమానులే గరం అయ్యారు.

వాస్తవానికి ఆఖరిరోజు పాకిస్తాన్‌ ఆటను దూకుడుగానే ఆరంభించింది. మొదటి సెషన్‌లో చూపెట్టిన జోరు చూసి ఈజీగా విక్టరీ సాధిస్తుందని అంతా భావించారు. కానీ లంచ్‌ విరామం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆసీస్‌ బౌలర్లకు పట్టు చిక్కడంతో పాకిస్తాన్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అలా టీ విరామ సమయానికి పాక్‌ ఐదు వికెట్లు నష్టపోయింది. బాబర్‌ ఆజం,సాజిద్‌ ఖాన్‌లు క్రీజులో ఉండడంతో పాక్‌కు మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. టీ విరామం మొదలైన తర్వాత ఆఖరి వరకు డ్రా దిశగా సాగింది. కానీ చివరి గంటలో ఆట మొత్తం మారిపోయింది. 55 పరుగులు చేసిన బాబర్‌ ఆజం ఔట్‌ కాగానే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

బాబర్ ఔట్‌ అయిన కాసేపటికే మిగిలిన బ్యాటర్స్‌ చేతులెత్తేశారు. అలా కేవలం 22 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు చేజార్చుకొని ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ అచ్చం ఇలాగే జరిగింది. 248 పరుగులుకు నాలుగు వికెట్లతో పటిష్టంగా కనిపించిన పాక్‌ 20 పరుగులు వ్యవధిలో మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ మెరిస్తే.. రెండో ఇన్నింగ్స్‌ను స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ శాసించాడు. పాక్‌ ఆటతీరుపై మండిపడిన అభిమానులు కామెంట్స్‌తో రెచ్చిపోయారు. '' ఒక గంటసేపు ఓపికపట్టలేకపోయారు.. ఇంకెదుకయ్యా మీరు క్రికెట్‌ ఆడి.. నిలకడలేమి ఆటతీరుకు మారుపేరు.. దానిని మరోసారి చూపించారు.. మనకే ఎందుకిలా జరుగుతుంది.. ఒకసారి అద్బుతంగా ఆడుతారు.. ఇంకోసారి పరమ చెత్తగా ఆడుతారు.. ఏదైనా మీకే సాధ్యం'' అంటూ పేర్కొన్నారు. 

 ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగిన కమిన్స్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవగా, సిరీస్‌ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఉస్మాన్ ఖవాజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య తొలి వన్డే లాహోర్‌ వేదికగానే మార్చి 29న జరగనుంది.

చదవండి: Pat Cummins: ఆసీస్‌ కెప్టెన్‌గా కమిన్స్‌ అరుదైన ఫీట్‌..

PAK VS AUS 3rd Test: తిప్పేసిన లియోన్‌.. పాక్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన ఆసీస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top