Harbhajan Singh: టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐలపై సంచలన వ్యాఖ్యలు చేసిన భజ్జీ

Dhoni Is Not My Wife, Harbhajan Explains Why He Does Not Need To Please Former Skipper - Sakshi

Harbhajan Singh Comments On MS Dhoni And BCCI: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోని, బీసీసీఐలపై భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ధోని సీనియర్ల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాడని, సరైన వివరణ ఇవ్వకుండా జట్టులో నుంచి అకారణంగా వెల్లగొట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ధోని వ్యవహార శైలి కారణంగా తనతో సహా వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్పాన్ పఠాన్, వీవీఎస్‌ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ లాంటి ప్లేయర్లు తుది జట్టులో చోటు కోసం అష్టకష్టాలు పడ్డామంటూ బాధను వెల్లగక్కాడు. 

ఇందుకు నాటి బీసీసీఐ పెద్దల్లో కొందరు ధోనికి సహకరించారని, నా లాంటి వాడికి భారత క్రికెట్‌ బోర్డులో గాడ్‌ ఫాదర్‌లు ఎవ్వరూ లేకపోవడంతో కెరీర్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని వాపోయాడు. ఓవైపు ధోనిని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే.. మాజీ కెప్టెన్‌తో తనకెలాంటి విభేదాలు లేవని, అలా ఉండటానికి అతనేమీ నా భార్య కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. 

ధోని కెప్టెన్సీలో ఉన్నత శిఖరాలు చేరే సమయానికి తాను టెస్ట్‌ల్లో 400కు పైగా వికెట్లు సాధించానని, అయినప్పటికీ ఎలాంటి వివరణ లేకుండా తనను జట్టులో నుంచి తప్పించారని గుర్తు చేశాడు. తనకు నాటి బీసీసీఐ పెద్దల మద్దతు ఉండివుంటే 600 వరకు టెస్ట్‌ వికెట్లు తీసి అప్పట్లోనే రిటైరయ్యేవాడినని తెలిపాడు. నాటి సెలక్టర్లు జట్టును కలిసి కట్టుగా ఆడనిచ్చేవాళ్లు కాదని, సీనియర్లు అద్భుతంగా రాణిస్తున్నా.. విశ్రాంతి పేరుతో అనపసరంగా పక్కకు కూర్చొబెట్టేవాళ్లని ఆరోపించాడు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ  సందర్భంగా భజ్జీ ఈ వ్యాఖ్యలు చేయగా, ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్‌ 24 టర్భనేటర్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 
చదవండి: Ind vs Wi: భువీపై టీమిండియా దిగ్గజం ఘాటు వ్యాఖ్యలు.. బ్రేక్‌ తీసుకుని...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top