 
													
David Warner Wife: నా భర్తకు దూరంగా... నాతో పాటు నా పిల్లలు కూడా: మనసులో ఆవేదన బయటపెట్టిన వార్నర్ భార్య
David Warner Wife Candice: Breaks Into Tears Staying Away From Husband: అంతర్జాతీయ క్రికెటర్లు.. ముఖ్యంగా జట్టులోని కీలక ఆటగాళ్లకు వరుస సిరీస్‌ల కారణంగా అస్సలు తీరిక ఉండదు.. కాస్త విశ్రాంతి దొరికినా.. తదుపరి మ్యాచ్ కోసం మరలా ప్రాక్టీసు మొదలెట్టాల్సి ఉంటుంది... అలా ఎల్లప్పుడూ ఆటలో తలమునకలై ఉంటారు కొంత మంది ఆటగాళ్లు. అలాంటి వాళ్లలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఒకడు. కొన్నిసార్లు.... వెంట భార్యాపిల్లలను తీసుకెళ్లినా వారితో గడిపే సమయం మాత్రం ఎక్కువగా దొరకదు. మరికొన్ని సార్లు నెలల పాటు వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది.

అలా భర్తకు దూరమై తాను వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయంటున్నారు వార్నర్ సతీమణి కాండిస్. ఒక్కోసారి చాలా కోపం వస్తుందని.. అయితే... వార్నర్ కేవలం తన భర్త మాత్రమే కాదని... ప్రాణస్నేహితుడని.. కాబట్టి తనను అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డెయిలీ మెయిల్‌తో ఆమె మాట్లాడుతూ... ‘‘ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. మనసు డీలా పడుతుంది. అలాంటి సమయాల్లో నేను డ్రైవింగ్ చేస్తూ వెళ్తూంటాను..
కన్నీళ్లు ఉబికి వస్తాయి.. తీవ్రమైన భావోద్వేగాలు నన్ను చుట్టుముడతాయి.. వెనుక సీట్లో కూర్చున్న నా పిల్లలు నన్ను చూసి.. ఏమైందో అర్థంకాక ఏడుస్తూ ఉంటారు.. ఇదంతా ఎప్పుడు ముగిసిపోతుందనే ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటుంది.. తను మాతో సమయం గడపడా? ఏమిటి ఇదంతా?... ’’ అని మదనపడుతూ ఉంటాను. అయినా తను నా భర్త.. నా బెస్ట్ ఫ్రెండ్... తన కోసం నేను నార్మల్‌గా ఉండాలి కదా అని నన్ను నేను తమాయించుకుంటాను’’ అని తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు.

చదవండి: David Warner Ashes Series: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్
ఫిర్యాదులతో తనను విసిగించకూడదు కదా!
‘‘తను ఆటపై దృష్టి సారించాలంటే.. ముందుగా తను ప్రశాంతంగా ఉండాలి.. ఆసీస్ తరఫున అత్యుత్తమ ఓపెనర్‌గా తను ఉండాలి. నిజానికి ఇదొక పెద్ద సవాలు. ఇలాంటి సమయంలో... ‘‘పిల్లలు అలా ఉన్నారు.. ఇలా చేస్తున్నారు... నా పరిస్థితి ఇది’’ అంటూ ఫిర్యాదులతో తనను విసిగించడం సరికాదు. నా భర్తకు నేను మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది’’ అని వార్నర్‌కు తాను చేదోడు వాదోడుగా ఉంటానని కాండిస్ చెప్పుకొచ్చారు.
కాగా బాల్ టాంపరింగ్ నేపథ్యంలో నిషేధం, ఆ తర్వాత ఐపీఎల్‌లోనూ గడ్డు పరిస్థితుల నేపథ్యంలో కాండిస్ వార్నర్‌కు అండగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా తన భర్త టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచినపుడు విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అలా ఎల్లప్పుడూ తన భర్తకు కష్టసమయాల్లో తోడుగా ఉంటానని చెప్పకనే చెప్పారు. ఇక వార్నర్ ప్రస్తుతం యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
