టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మాజీ భార్యకు కోర్టు అక్షింతలు

Court Restrains Ex Wife Of Shikhar Dhawan From Making Defamatory Allegations - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, వెటరన్ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ కోర్టు మెట్లెక్కాడు. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితులు, క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్‌ చేస్తుందని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు.

ధవన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అయేషాను మందలించింది. ధవన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియాతో కానీ అతని స్నేహితులు, బంధువులతో కానీ మరే ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై కానీ షేర్‌ చేయొద్దని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. ధవన్‌ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నత వ్యక్తి అని, అంతేకాక అతను భారత క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుడని, అతని రెప్యుటేషన్‌ దెబ్బతినే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది.

భారత్‌, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన అయేషా తన వాదనలను వినిపించేందుకు ఇది సరైన మార్గం కాదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే రెండు దేశాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, ధవన్‌ 2012లో అస్ట్రేలియాకు చెందిన అయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు (జోరావర్‌) జన్మించాడు. అయేషాకు ధవన్‌తో పెళ్లికి ముందే వివాహం జరిగింది. వారికి రియా, ఆలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మనస్పర్ధల కారణంగా ధవన్‌-అయేషా 2021లో విడిపోయారు. కోర్టు వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు మేరకు ధవన్‌ మెయింటెనెన్స్‌ సరిగ్గా చల్లించట్లేదని అయేషా ప్రస్తుతం ఆరోపిస్తుంది. కాగా, టీమిండియాలో కీలక సభ్యుడైన శిఖర్‌ ధవన్‌ ఇప్పటివరకు 34 టెస్ట్‌లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఇందులో 2315 టెస్ట్‌ పరుగులు (7 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు), 6793 వన్డే పరుగులు (17 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలు), 1759 టీ20 పరుగులు (11 హాఫ్‌ సెంచరీలు) ఉన్నాయి. ధవన్‌ పలు మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top