
మీర్‌పూర్: ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ‘వైట్ వాష్’కు గురైన వెస్టిండీస్ జట్టు... బంగ్లాదేశ్ పర్యటనను కూడా పరాజయంతోనే ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (90 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మహిదుల్ ఇస్లామ్ (46), నజ్ముల్ హుసేన్ షంటో (32) ఫర్వాలేదనిపించారు.
విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టగా... రోస్టన్ చేజ్, జస్టన్ గ్రీవ్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులభతర లక్ష్యఛేదనలో కరీబియన్ జట్టు విఫలమైంది. బ్యాటర్లంతా తేలపోవడంతో చివరకు 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (60 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుసేన్ 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విండీస్ టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. బ్యాటింగ్‌లోనూ 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, 2 సిక్స్‌ల సాయంతో 26 పరుగులు చేసిన రిషాద్... బౌలింగ్ అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.