
నెదర్లాండ్స్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (BAN vs NED T20I) ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో లిటన్ దాస్ బృందం చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
కాగా ఆసియా కప్-2025 (Asia Cup) సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ సొంతగడ్డపై నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా జట్టు.. తాజాగా రెండో టీ20లోనూ సత్తా చాటింది.
103 పరుగులకే ఆలౌట్
సెల్హైట్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ ఆతిథ్య జట్టు బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 17.3 ఓవర్లలో కేవలం 103 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
ఓపెనర్లలో మాక్ ఒడౌడ్ (8) విఫలం కాగా.. విక్రమ్‌జిత్ సింగ్ (24) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్‌డౌన్లో వచ్చిన తేజ నిడమానూరు డకౌట్ కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ చార్ల్స్ ఎడ్‌వర్డ్స్ (9), షారిజ్ అహ్మద్ (12), నోవా క్రోస్ (2), సికందర్ జుల్ఫికర్ (2) కూడా చేతులెత్తేశారు.
మూడు వికెట్లతో సత్తా చాటిన నసూమ్
కైల్ క్లెన్ (4) కూడా విఫలం కాగా.. ఆఖర్లో ఆర్యన్ దత్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి డచ్ జట్టు ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లా బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ నసూమ్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా రెండు వికెట్లు కూల్చారు.

తాంజిద్ హసన్ తమీమ్ అర్ధ శతకం
మిగిలిన వారిలో మెహదీ హసన్, తాంజిమ్ హసన్ సకీబ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ మరోసారి దుమ్మురేపింది. 13.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 104 పరుగులు సాధించింది. ఓపెనర్లలో పర్వేజ్ హొసేన్ ఇమాన్ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. తాంజిద్ హసన్ తమీమ్ అర్ధ శతకంతో సత్తా చాటాడు.
మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న తాంజిద్.. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ లిటన్ దాస్ (18 బంతుల్లో 18 నాటౌట్) నిలవగా.. ఫోర్‌తో తాంజిద్ బంగ్లా విజయాన్ని ఖరారు చేశాడు.
ఇక నెదర్లాండ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన నసూమ్ అహ్మద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- నెదర్లాండ్స్ మధ్య నామమాత్రపు మూడో టీ20కి బుధవారం (సెప్టెంబరు 3) షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: IND vs PAK: నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి