నీకోసమే నాన్నా.. ఎంత పనిజేసినవ్‌ కొడుకా! వీడియో వైరల్‌

Azam Khan Dedicates His Innings To Father Shocked Reaction Why - Sakshi

Pakistan Super League, 2023: కడుపున పుట్టిన బిడ్డలు తాము అనుకున్న రంగంలో రాణిస్తే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు. అద్భుతమైన ప్రతిభాపాటవాలతో పేరు తెచ్చుకుంటే మురిసిపోతారు. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ మొయిన్‌ ఖాన్‌కు తన కుమారుడి కారణంగా ఇలాంటి అనుభూతి కలిగింది.

తనలాగే బ్యాట్‌ పట్టి అద్భుత ఇన్నింగ్స్‌తో కొడుకు చెలరేగడంతో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు మొయిన్‌. అయితే, అదే సమయంలో ‘ఎంత పనిజేసినవ్‌ బిడ్డా’ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. కొడుకు ‘హీరోచిత’ ఇన్నింగ్స్‌ను తనకు అంకిమితమివ్వగానే చప్పట్లతో అతడిని అభినందించిప్పటికీ అతడి విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు. ఇందుకు కారణమేమిటంటే..

విధ్వంసకర ఇన్నింగ్స్‌తో
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో భాగంగా ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, క్వెటా గ్లాడియేటర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. కరాచీలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌ 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. తృటిలో సెంచరీ(97 పరుగులు) చేజారినా జట్టుకు విజయం అందించి ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ గా నిలిచాడు.

ఈ క్రమంలో మరుపురాని ఇన్నింగ్స్‌ను తండ్రికి అంకితమిచ్చాడు. డగౌట్‌లో కూర్చున్న తండ్రి మొయిన్‌ ఖాన్‌ వైపు చూస్తూ.. ‘‘ఈ ఇన్నింగ్స్‌ నీకోసమే నాన్నా’’ అన్నట్లు సైగ చేశాడు. దీంతో మొయిన్‌ ఖాన్‌ చప్పట్లతో కొడుకుకు శుభాభినందనలు తెలియజేశాడు. కానీ.. తన జట్టుకు పరాభవం ఎదురుకావడంతో కాస్త నిరాశపడ్డాడు. అవును.. ఆజం ఖాన్‌ కారణంగా క్వెటా గ్లాడియేటర్స్‌ 63 పరుగుల తేడాతో ఓటమిపాలు కావడంతో మొయిన్‌ ఖాన్‌ చిక్కుల్లో పడ్డాడు.

తండ్రి కోచ్‌గా ఉన్న జట్టుపై సునామీ ఇన్నింగ్స్‌తో
ఆజం ఖాన్‌ సునామీ ఇన్నింగ్స్‌తో.. తాజా విజయం కారణంగా ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ పీఎస్‌ఎల్‌-2023 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఆజం ఖాన్‌ తండ్రి మొయిన్‌ ఖాన్‌ క్వెటా జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

దీంతో ఆజం ఇన్నింగ్స్‌ చూసిన మెయిన్‌ ఖాన్‌ షాక్‌లో ఉండిపోయాడు. కొడుకు ఆటకు మురిసిపోవాలో.. లేదంటే తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు చేరువైన తరుణంలో బాధపడాలో తెలియని సంకట స్థితిలో పడ్డాడు.

పెద్ద ప్రమాదమే!
క్వెటా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో కొడుకు వల్ల మొయిన్‌ ఖాన్‌కు పెద్ద ప్రమాదమే వచ్చి పడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మొయిన్‌ 1990- 2004 మధ్య కాలంలో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. ఇక తన తండ్రి కోచ్‌గా వ్యవహరిస్తున్న జట్టుపై కొడుకు ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం బహుశా పీఎస్‌ఎల్‌ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు.

చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు!
WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top