
ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా ఫుల్
●ఇప్పటికే రూ.30కోట్లకుపైగా రాబడి ●అవగాహన కొరవడటంతో కొందరు దూరం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) పథకం జిల్లాలో కాసుల వర్షం కురిపించింది. 25శాతం రాయితీ జిల్లాలో సానుకూల ఫలితాలు అందించింది. జిల్లా వ్యాప్తంగా క్రమబద్ధీకరణతో రూ.30 కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వ ఖాజానాలో జమ అయ్యింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినప్పటికీ మరో 70 వేల దరఖాస్తులు పథకాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. ప్రక్రియపై మరింత అవగాహన, చైతన్యం కల్పించినట్లయితే కాసులవరద పారేదే.
సిద్దిపేటజోన్: జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో, సుడా పరిధిలో ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు 2020లో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 1,01,276 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో వివిధ కారణాలతో అధికారులు 475 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ క్రమంలో 91,159 దరఖాస్తులను రివైజ్డ్ చేసి ఫీజు చెల్లింపు కోసం అనుమతించారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ సానుకూల ఫలితాల కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుదారులకు 25 శాతం ఫీజులో రాయితీ ప్రకటించింది. దీంతో ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చి ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 3తో 25 శాతం రాయితీ గడువు ముగియడంతో అధికారిక లెక్కల ప్రకారం రూ.30 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. 91,159 అనుమతించిన దరఖాస్తులలో కేవలం 17,880మంది మాత్రమే పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించి సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా 73,279 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించకుండా ప్రక్రియకు దూరంగా ఉన్నారు. వారందరికీ అవగాహన కల్పించి పథకం సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.
చైతన్యం తప్పనిసరి
క్రమబద్ధీకరణ వందశాతం అమలు అయ్యేందుకు ప్రజల్లో చైతన్యం తప్పనిసరి. క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజల్లో స్పందన రావడం లేదు. రాయితీలు, వివిధ రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజల్లో కొంత కదలిక వస్తోంది. క్రమబద్ధీకరణ ఉద్దేశం.. దాని ప్రయోజనం గురించి వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం సమయంలో క్రమబద్ధీకరణ చేసుకోవచ్చనే ధీమాతో దరఖాస్తుదారులు ఉండడంతో ప్రక్రియ వందశాతం అమలుకు అడ్డంకిగా మారుతోంది. ప్రజల్లో చైతన్యం ద్వారానే క్రమబద్ధీకరణ లక్ష్యం అధిగమించేందుకు దోహదపడుతుందని చెప్పాలి.