
నిబంధనలు పక్కాగా పాటించాలి
కండీషన్ లేని స్కూల్ బస్సులనుసీజ్ చేస్తాం: డీటీఓ క్రిస్టోఫర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సుల విషయంలో నిబంధనలు పక్కాగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి క్రిస్టోఫర్ సూచించారు. బుధవారం జిల్లా కార్యాలయంలో స్కూల్ బస్సు యజమానులు, ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బస్సుల ఫిట్ నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్కూల్ యజమానులు పక్కన పెట్టాలని, రవాణా శాఖ నిబంధనల మేరకు నిర్ణీత గడువు దాటినా వాటిని స్క్రాప్ పరిధిలో చేర్చడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్ బస్సు ను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కండిషన్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బస్సులో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉండేలా బాక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందులో అవసరమైన అత్యవసర మందులు ఉంచాలని సూచించారు. ప్రతి బస్సులో అత్యవసర ద్వారం ఉండాలన్నారు. త్వరలో స్కూల్ బస్సుల ఫిట్ నెస్, నిబంధనలపై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు.