
ప్రగతి బాటలో కీలక అడుగు
ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీ ప్రాజెక్ట్
ప్రగతి బాటలో మరో కీలక అడుగు పడింది. ట్రిపుల్‌ఆర్, జాతీయ రహదారుల సమాహారం, రైల్వేలైన్ ఇతర సానుకూల అంశాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో రూ.996కోట్ల వ్యయంతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి కేంద్రం టెండర్లను పిలిచింది. ఇందుకోసం సుమారు 350ఎకరాల భూసేకరణ కూడా పూర్తయ్యింది.
గజ్వేల్: మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు(బహుళవిధ సరుకు రవాణా సేవల సముదాయం) నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం 16 లాజిసిక్స్ పార్కులను మంజూరు చేసింది. అందులో మనోహరాబాద్ మండలం పరికిబండ శివారులో నిర్మించనున్న పార్కు ఒకటి. రూ.996కోట్ల అంచనాల వ్యయంతో ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా) అనుబంధ సంస్థ అయిన నేషనల్ హైవేస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎమ్‌ఎల్) టెండర్లను పిలిచింది. ఈమేరకు పత్రికల్లో ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఈ పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడానికి నిర్ణయించారు. వేల కోట్ల పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా ఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రత్యక్షంగా లక్ష, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు.
మచిలీపట్నం పోర్టుకు నేరుగా
మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు అందుబాటులోకి వస్తే ఇక్కడ సరుకు రవాణా, సమీకరణ, పంపిణీ లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు నేరుగా సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుంటుంది. ఇందుకోసం త్వరలోనే నిర్మించనున్న ట్రిపుల్‌ఆర్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా మచిలీపట్నం వరకు రోడ్డు కనెక్టివిటీ అవకాశాలు ఉండటంతో ఈ ప్రతిపాదన ఆమోదం పొందడానికి అవకాశం కలిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లాకు మహర్దశ
లాజిస్టిక్ పార్కు నిర్మాణం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ జిల్లా వస్తు రవాణా రంగంలో హబ్‌గా మారితే.. దీనికి అనుబంధంగా మరెన్నో పరిశ్రమలకు ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ కారణంగా గజ్వేల్‌లో ఇప్పటికే గూడ్స్ రైళ్లు నడుస్తుండగా, ఎరువుల రేక్ పాయింట్ విజయవంతంగా నడుస్తోంది. లాజిస్టిక్ పార్కు ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందనునుంది. దీని ద్వారా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.
ఎన్నో అనుకూలతలు..
ఎన్నో అనుకూలతల కారణంగా మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి పరికిబండ శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ లాజిస్టిక్ పార్కు ఏర్పాటైతే.. ఈ ప్రాంతానికి 44వ నంబర్ ఆరువరుసల జాతీయ రహదారి, కొత్తగా నిర్మాణం కానున్న ట్రిపుల్‌ఆర్‌కు సమీపంలో ఉండటం, ఇక్కడి నుంచి హైదరాబాద్, కొత్తపల్లి రైల్వేలైన్‌లు అనుసంధానం కావడం, హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం కూడా చేరువలో ఉండటం కలిసి వచ్చింది.
మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కునిర్మాణానికి సన్నాహాలు
పరికిబండ శివారులో350ఎకరాల భూసేకరణ
రూ.996కోట్లతో టెండర్లకు ఆహ్వానం
లక్షలాదిమందికి ఉపాధి కల్పనే లక్ష్యం