
దేవుడా.. ఎన్నాళ్లీ వెతలు
ఇన్‌చార్జి ఈఓలతో ఆలయాల నిర్వహణ
● సమస్యలతో భక్తులు సతమతం ● 30 పోస్టులు ఖాళీ.. గ్రూప్– 2 పైనే ఆశలు
సంగారెడ్డి జోన్: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఆయా దేవాలయాలకు రెగ్యులర్ ఈఓలు లేకపోవడంతో ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులకు సైతం పలు రకా ల ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ప్రముఖ దేవాలయాలున్నాయి. అదేవిధంగా ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గుర్తింపు పొందినవి 939 దేవాలయాలు న్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి నాలుగు కేటగిరీల వారీగా విభజించారు. 6(ఏ) కేటగిరీలో 13, 6(బీ) కేటగిరీలో 12, 6(సీ) కేటగిరీలో 10, 6 (డీ) కేటగిరీలో 1 చొప్పున ఆలయాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయం, రుద్రారం గణేశ్‌గడ్డ, బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్రేశ్వర, మెదక్‌లోని ఏడుపాయల శ్రీ దుర్గ భవాని ఆలయం, సిద్దిపేటలోని కోటిలింగాల, వెంకటేశ్వర తదితర ఆలయాలున్నాయి.
ఒక్కో అధికారికి పదికి పైగా బాధ్యతలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ఈఓ పోస్టులు మంజూరు ఉండగా కేవలం 6 పోస్టులు మాత్రమే భర్తీ ఉన్నాయి. ఒక్కో ఈఓకు సుమారు 10కి పైగా ఆలయాలకు అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అధికారులకు అదనపు బాధ్యతలు ఉండటంతో ఆలయ అభివృద్ధి జరగకపోవటంతోపాటు భక్తుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆలయాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్న తమ పరిధిలో ఉన్న ఆలయాల సందర్శనకు మాత్రమే సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నా రు. అదనపు బాధ్యతలతో ఆలయ అధికారులకు బాధ్యతలు, నిర్వహణ భారంగా మారాయి. అధికారులకు కేటాయించిన ఆలయాలు కొన్ని కిలోమీటర్ల మేర దూరం ఉండటంతో అధికారులకు దూరాభారంతోపాటు సమయం వృథా అవుతోంది. ఆలయాలకు కోర్టు తగాదా లు ఉండటంతో అక్కడికి హాజరు అవుతుండటంతో ఆలయ అధికారులకు ఆలయ నిర్వహణ భారంగా మారింది.
నియామకం కానీ రెగ్యులర్ అధికారులు
ఆలయ అధికారులే కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు ఏడుపాయల దుర్గా భవాని ఆలయ ఈఓగా బాధ్యత లు నిర్వహిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి దేవదాయ శాఖలో ఈఓ పోస్టులు భర్తీ చేసినప్పటికీ చేపట్టలేకపోయారు. ఇటీవల గ్రూప్–2 ఫలితాలు విడుదల కావడంతో వాటి ద్వారా నియామకం చేపట్టే అవకాశాలున్నాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.