
చెరువులపై చిన్నచూపు!
● 114 చెరువు లకు పది నెలల క్రితం రూ. 31.19 కోట్లు మంజూరు
● ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి చేయని నీటిపారుదలశాఖ
● పనులు ప్రారంభమయ్యేదెప్పుడు.. పూర్తయ్యేదెన్నడు..?
● ఖరీఫ్ సీజన్‌లోనూ ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చెరువుల మరమ్మతులకు అలసత్వం గ్రహణం పట్టుకుంది. నిధులు మంజూరై ఏడాది దగ్గర పడుతున్నప్పటికీ.. నీటి పారుదల శాఖ టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. చిన్న నీటి వనరుల అభివృద్ధే లక్ష్యంగా జిల్లాలో మొత్తం 114 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 31.19 కోట్ల నిదులు మంజూరయ్యాయి. ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలంలో 23 చెరువుల మరమ్మతులకు రూ.4.96 కోట్లు, చౌటకూర్ మండలంలో 25 చెరువుల మరమ్మతులకు రూ. 5.21 కోట్లు, ఆందోల్ మండలంలో 37 చెరువులకు రూ.16.04 కోట్లు మంజూరయ్యాయి. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో 29 చెరువుల మరమ్మతులకు రూ. 4.98 కోట్లు మంజూరయ్యాయి. ఆయా చెరువుల కట్టల బలోపేతం, తూముల లీకేజీలకు మరమ్మతులు, అలుగు రిపేర్లు, అవసరమైన చోట్ల గైడ్‌వాల్‌ల నిర్మాణం, కాలువల్లో పూడికతీత వంటి పనులు చేపట్టేందుకు ఈ నిదులు మంజూరయ్యాయి. ఇందులో కొన్ని చెరువులకు 2024 సెప్టెంబర్‌లో జీఓలు జారీ అయ్యాయి. అంటే దాదాపు పది నెలలు దాటింది. అయినప్పటికీ టెండరు ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈ పనులు ప్రారంభమే కాకపోవడంతో ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరందడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఆ ఇద్దరు నేతల నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా..
అధికార కాంగ్రెస్‌లో ఇద్దరు కీలక నేతల నియోజకవర్గాలకు ఈ నిధులు మంజూరయ్యాయి. మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేకంగా తమ నియోజకవర్గాల్లోని చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించుకున్నారు. జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాల్లో మినహా, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు నిధులు రాలేదు. ఈ రెండు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరైనప్పటికీ, పనులు జరగకపోవడంతో ఆయా చెరువుల పరిస్థితి మెరుగుపడటం లేదు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న చెరువు పుల్కల్ మండలం చిట్టారెడ్డికుంట. దీని మరమ్మతు కోసం 2024 సెప్టెంబర్ 25న రూ.15.90 లక్షలు మంజూరయ్యాయి. కానీ పదినెలలైనా నీటిపారుదల శాఖ ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ కుంట కింద ఉన్న ఆయకట్టుకు ఈసారి సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇలా జిల్లాలో సుమారు 114 చెరువుల మరమ్మతుల పరిస్థితి కూడా ఇదే తీరుగా ఉంది.
ఎస్‌ఈ లేకపోవడంతో...
ఈ పనులకు నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్‌ఈ) కార్యాలయం టెండర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ప్రస్తుతం జిల్లాకు ఎస్‌ఈ లేకపోవడంతో టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నారు. ఈఎస్‌ఈగా పనిచేసిన ఏసయ్య మేలో పదవీ విరమణ చేసిన విషయం విధితమే. అప్పటి నుంచి ప్రభుత్వం ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు. దీంతో టెండర్ ప్రక్రియ ముందుకుసాగడం లేదు.
తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చిన పుల్కల్, చౌటకూర్ మండలాలకు సంబంధించిన చెరువులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌లో ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. మేలో మరోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎస్‌ఈ పదవీ విరమణ చేయడంతో ఈ టెండర్లను ఓపెన్ చేయలేదు.
వర్షాలు ఎక్కువై చెరువుల్లో నీరు చేరితే ఈ మరమ్మతులు చేయడం వీలుకాదు. దీంతో ఈ పనులకు మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తయితే.. కనీసం అక్టోబర్, నవంబర్‌లో నీటి మట్టాలు తగ్గాక పనులు చేసేందుకు వీలు కలుగుతుంది. కనీసం మూడు నెలల్లోనైనా టెండర్ ప్రక్రియను నిర్వహించి మరమ్మతులు పూర్తి చేస్తే ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.