
ఆ ఆస్పత్రి హరిత వనం
హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణం చుట్టూ పచ్చదనం పరిచినట్లుగా చెట్లు, మొక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి వందలాది మొక్కలు నాటించారు. దాదాపు మూడేళ్ల నుంచి గ్రీనరీపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నాటిన మొక్కలను సంరక్షిస్తూ చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ మొక్కలు నేడు ఎపుగా పెరిగి ఆస్పత్రి వచ్చే రోగులకు నీడనిస్తున్నాయి. వారితోపాటు రోగులను చూడటానికి వచ్చే బంధువులు సైతం చెట్ల నీడన సేద తీరుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పూల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు పెంచుతూ ఆస్పత్రి ఆవరణను హరిత వనంగా మార్చారు. ఆస్పత్రి ప్రధాన ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన పూల కుండీలు అందరిని ఆకర్షిస్తున్నాయి.