
ఫైర్ సేఫ్టీకి పాతర
● అగ్ని ప్రమాదాల నివారణకు కనీస నిబంధనలు పాటించని సిగాచీ
● ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిశ్రమ ఆగడాలు
● రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన అగ్నిమాపకశాఖ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పదుల సంఖ్యలో అమాయక కార్మికుల ప్రాణాలను బలిగొన్న సిగాచీ పరిశ్రమ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలో కనీస భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యం..ఇటు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు సైతం పాతర వేసినట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో తేలింది. జూన్ 30న జరిగిన ఈ భారీ పేలుడు ఘటనలో ఇప్పటికే 44 మంది మృతి చెందగా, ఎనిమిది మంది ఆచూకీలేకుండా పోయారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 52కు చేరింది. మరో 16 మంది ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.
అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీల ఆటోమెటిక్ స్పింక్లర్ సిస్టం ఉండాలి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఈ స్పింక్లర్లు తెరుచుకుని అగ్ని కీలలను ఆర్పే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ఈ పరిశ్రమలో ఈ సిస్టం లేదని ఆశాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ఆటోమెటిక్ డిటెక్టర్ సిస్టం కూడా అమర్చుకోవాలి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండకుండా తక్షణం స్పందించేలా ఈ సిస్టం పనిచేస్తుంది. కానీ, ఆటోమెటిక్ డిటెక్టర్ కూడా లేదు. ఫోమ్‌ఆధారిత అగ్ని నిరోధక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంచుకోవాల్సి ఉండగా, రూ.వందల కోట్ల లాభాలను ఆర్జిస్తున్న యాజమాన్యం ఈ అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేదు.
మంటలార్పేందుకు నీళ్ల సంపు కూడా లేదు
పరిశ్రమలోనైనా కనీసం లక్ష లీటర్లు సామర్థ్యంతో కూడిన నీళ్ల సంపు, దానికి కరెంట్, డీజిల్‌తో నడిచే మోటార్లు ఉండాలి. కనీసం ఈ చిన్న ఏర్పాట్లు కూడా చేయలేదంటే యాజమాన్య నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
● ఉత్పత్తి కొనసాగే ప్రొడక్షన్ బ్లాక్ పైనే అడ్మిన్ బ్లాకు ఉంది. ఈ బ్లాకుకు ఎమర్జెనీ డోర్లు ఎమ ర్జెనీ మెట్లు కూడా లేవు. బయటకు దారిచూపే సైన్‌బోర్డులు ఉండాలి. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుక్ను వారు ఈ ఎమర్జెన్సీ డోర్లు లేక పైప్‌లైన్‌లు పట్టుకుని కిందికి దూకినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
● ఫైర్ ఇంజన్ తిరిగేంత స్థలం ఫ్యాక్టరీ చుట్టూ ఉండాలి. కానీ ఈ ఫ్యాక్టరీకి ఆ స్థలం కూడా లేదు. రెండు వైపులా పబ్లిక్ రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇలా అగ్ని మాపకశాఖకు సంబంధించిన ఏ ఒక్క నిబంధనను కూడా పరిశ్రమ యాజమాన్యం పాటించలేదంటే నిరుపేద కార్మికులు, ఉద్యోగుల ప్రాణాల పట్ల ఆ యాజమాన్యానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ
సిగాచీ పరిశ్రమపై అగ్నిమాపకశాఖ కూడా తాజాగా కేసు నమోదు చేసింది. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్టు –1999 సెక్షన్ 31, 31ల కింద ఈ నెల 7న సంగారెడ్డి అగ్నిమాపకశాఖ అధికారులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జేఎఫ్‌సీఎం కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. అగ్నిమాపకశాఖకు సంబంధించి కనీస నిబంధనలు పాటించకుండా... నిర్లక్ష్యం చేసినందుకుగాను ఈ కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపకశాఖ అధికారు లు తెలిపారు. అన్ని శాఖల మాదిరిగానే అగ్నిమాపక శాఖ ప్రమాదం జరిగాక..అమాయక కార్మికుల ప్రాణాలు పోయాక చర్యలకు ఉపక్రమించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.