
రూ. కోటి పరిహారం ఇవ్వాలి
తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలి: జాన్‌వెస్లీ
రామచంద్రాపురం: పాశమైలారం ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రమాద స్థలాన్ని సీపీఎం బృందం పరిశీలించింది. అనంతరం జాన్‌వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. శాశ్వత వైకల్యం కల్గిన వారికి రూ.50 లక్షలు..గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర నేతలు రమేష్, వెంకటేశ్, జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.