
కార్మికులకు రక్షణేది?
● పరిశ్రమల్లో కానరాని భద్రత
● శ్రమ దోపిడీకి గురవుతున్న
వలస కార్మికులు
● ప్రభుత్వ రక్షణ పథకాలు దూరమే
నారాయణఖేడ్: పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ఘోర పేలుడు విస్పోటనం జిల్లా వాసులను తీవ్రంగా కలచివేసింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో కూడా రక్షణ చర్యలు లేవనే చర్చ కొనసాగుతోంది. జిల్లాలో పత్తి మిల్లు, చెరుకు ఫ్యాక్టరీ, రైస్‌మిల్స్, కంకర క్రషర్, ఫ్లోర్‌మిల్, ఇటుక బట్టీలు, బోరుమోటార్ల డ్రిల్లింగ్, గృహనిర్మాణ రంగం తదితర పరిశ్రమలు సాగుతున్నాయి. స్థానికేతరులు తక్కువ వేతనానికి వస్తుండటంతో వారినే తీసుకుంటున్నారు. హక్కుల గూర్చి అడగకపోవడం, ఎక్కువ పనిగంటలు పని చేస్తుండటంతో యజమాన్యాలు వారినే పనిలో కుదుర్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో పనులు చేయిస్తుండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం పటాన్‌చెరు ఘటన నేపథ్యంలో వలస కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వలస కార్మికులే అధికం
జిల్లాలోని పరిశ్రమల్లో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బెంగాళ్ తదితర రాష్ట్రాల వలస కార్మికులు వచ్చి పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అక్కడి కాంట్రాక్టర్లు కార్మికులను ముఠాలుగా తీసుకొచ్చి ఇక్కడ పనుల్లో నియమిస్తున్నారు. యాజమాన్యాల నుంచి నిత్యం పని ఒత్తిడి, శ్రమదోపిడీ, సకాలంలో వేతనం, సరుకులు ఇవ్వకుండా వేధించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరక్షరాస్యులు కావడంతో చట్టాలపై అవగాహన లేకపోవడం, రక్షణ అంశాలు తెలియక దోపిడీని ఎదుర్కోలేకపోతున్నారు. రసాయన ప్రదేశాల వద్ద పని చేస్తున్న కార్మికులకు కనీసం సేఫ్టీ షూస్, హెల్మెట్లు, గాగుల్స్, అప్రాన్ తదితర రక్షణ చర్యలు చేపట్టడం లేదు. కంకర క్రషర్ యంత్రాల వద్ద పనిచేస్తున్న కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోని కారణంగా దుమ్ము ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అసువులు బాస్తున్నారు. ఓ ఫ్లోర్‌మిల్‌లో ఓ మహిళ పడి తల, మొండెం వేరైన ఘటన ఆరేళ్ల క్రితం ఖేడ్‌లో చోటు చేసుకుంది. ప్రమాదాలు జరిగి మరణం సంభవించిన సందర్భాల్లో బాధితులకు ఎంతో కొంత ముట్టజెప్పి కేసు కాకుండా తప్పుకుంటున్నారు. పరిశ్రమలపై అధికారులు తనిఖీలు లేకపోవడంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతుంది.
కనీస నిబంధనలు పాటించాలి
షెడ్యూల్ పరిశ్రమలైన వీటిలో చట్ట ప్రకారం ఐదేళ్ల కోసారి వేతనాలు పెంచాలి. సేఫ్టీ రక్షణతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలి. బోనస్ ఇవ్వాలి. షూ, అఫ్రాన్, మాస్క్, హెల్మెట్ సదుపాయాలు కల్పించాలి. 20 రోజులకు ఒకసారి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. న్యాయపరమైన పనిగంటలు, ఆరోగ్యం, వృత్తి భద్రత కల్పించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలి. యూనిఫాం, గుర్తింపుకార్డు జారీ చేయాలి. ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించాలి. ప్రమాద బీమా కల్పించాలి. రవాణా ఏర్పాటు, క్యాంటీన్ సదుపాయం ఉండాలి.
ప్రయోజనాలూ కల్పించరు
కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజీబీవై) లో నైపుణ్యంలేని సహా కార్మికులకు జీవిత బీమా రక్షణ కల్పించాలి. పీఎం సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) కార్మికులకు ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం బీమా రక్షణ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన ద్వారా పదవీ విరమణ తర్వాత కార్మికులు పెన్షన్ పొందే సదు పాయం. పీఎం శ్రమ యోగి మాన్–ధన్ (పీఎం–ఎస్‌వైఎం) అసంఘటిత కార్మికులకు, నైపుణ్యం లేని కార్మికులతో సహా ఒక పెన్షన్ పథకం. కానీ ఏవీ వీరికి అమలు చేయడం లేదు.